Rituraj Hotel Fire Accident: కోల్ కతాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుర్దా బజార్ లోని మెచ్చుపట్టి రుతురాజ్ హోటల్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 14 మంది సజీవదహనం అయ్యారు. వీరిలో 11 మంది పురుషులు కాగా, ఒక మహిళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, హోటల్ అంతా పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక చాలా మంది మృతి చెందారు. మృతులలో 8 మందిని గుర్తించినట్లు కోల్ కతా పోలీసులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రాణం తీసిన దట్టమైన పొగలు
ఇక హోటల్లో బస చేస్తున్న పలువురు పలువురు ప్రాణాలు కాపాడుకోవడానికి హోటల్ కిటికీలను పగులగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. మరికొంత మంది బయట పడే అవకాశం లేక గదుల్లో అలాగే ఉండిపోయారు. వీరిలో పలువురు ఊపరి ఆడక చనిపోయినట్లు వెల్లడించారు పోలీసులు. హోటల్ కారిడార్లలో దట్టమైన పొగలు కమ్ముకోవడం, అదే సమయంలో కరెంట్ పోవడంతో బస చేసిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
మంటలు ఆర్పిన 10కి పైగా ఫైర్ ఇంజిన్లు
అగ్ని ప్రమాద విషయం తెలియగానే పదికి పైగా ఫైర్ ఇంజినట్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ఫైర్ ఇంజిన్లకు సంబంధించిన నిచ్చెనల ద్వారా అగ్నిమాపక సిబ్బంది హోటల్ లో చిక్కుకున్న కొంత మందిని బయటకు తీసుకొచ్చారు. సుమారు 10 గంటల పాటు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు ఫైర్ సిబ్బంది. మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగితే, బుధవారం ఉదయం సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. రుతురాజ్ హోటల్ లో తక్కువ ధరకే గదులు అద్దెకు లభిస్తాయి. ఎక్కువ మంది ఈ హోటల్ లో ఉండేందుకు ప్రత్నిస్తారు. ప్రమాదం జరిగిన సమయంలో 42 గదుల్లో సుమారు 88 మంది అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బయటకు వచ్చేందుకు వీలుకాక చాలా మంది గదుల్లోనే ఉండిపోయినట్లు పోలీసులు తెలిపారు.
కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి!
రితురాజ్ హోటల్లో చెలరేగిన మంటలు
ఈ ఘటనలో 14 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక సిబ్బంది
కొనసాగుతున్న సహాయక చర్యలు pic.twitter.com/jqHkQ87xHX
— BIG TV Breaking News (@bigtvtelugu) April 30, 2025
దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించిన సీఎం మమతా
ఈ ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాత్రంతా అక్కడే ఉంది సహాయక చర్యలను పర్యవేక్షించారు. హోటల్ గదులలో మండే వస్తువుల కారణంగా ఈ అగ్నిప్రమాద తీవ్రత పెరిగినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఇందుకోసం సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదం నుంచి హోటల్ లోని వారిని కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని, స్థానికులను మమతా అభినందించారు.
మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం
అటు ఈ అగ్నిప్రమాదంలో చనిపోయిన 14 మంది బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. PMNRF ద్వారా రూ. 2 లక్షల చొప్పున అందజేయనున్నట్లు పీఎంఓ వెల్లడించింది.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
కోల్ కతా అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదం బాధాకరం అని రాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు.
Read Also: ఒడియమ్మా.. ఇదేం నెంబర్ ప్లేట్ రా అయ్యా.. నేనెక్కడా చూడలే!