Maoist surrender : దేశంలో మావోయిస్టుల పై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో.. కర్ణాటక రాష్ట్రం తొలిసారిగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించుకుంది. ఆ రాష్ట్రంలోని అడవులు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులు అంతా తిరిగి జన జీవన స్రవంతిలోకి కలిశారని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ప్రకటించారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన చివరి మవోయిస్టుగా చెబుతున్న లక్ష్మీ పోలీసులు ఎదుట లొంగిపోయింది. ఆదివారం ఉడిపి డిప్యూటీ కమిషనర్ (డీసీ) విద్యా కుమారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అరుణ్ ఎదుట బేషరతుగా లక్ష్మీ లొంగిపోయింది. ఆమె లొంగుబాటుతో ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం అందించారు.
లొంగిపోయిన మావోయిస్టు లక్ష్మి వాస్తవానికి కుందాపురా తాలూకాలోని మచ్చట్టు గ్రామానికి చెందిన తొంబట్టుకు చెందినదని పోలీసులు తెలుపుతున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబాన్ని విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఈమె.. నక్సలైట్ అజెండాతో పనిచేస్తోంది. లక్ష్మిపై ఉడిపి జిల్లా కుందాపూర్ తాలూకాలోని అమాసెబైల్, శంకరనారాయణ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు ఉన్నాయి. ఈ కేసులు 2007-2008 నాటివి కాగా.. పోలీసులతో ఎదురుకాల్పులు, దాడి, గ్రామాలు, చిన్న పట్టణాలలో మావోయిస్టు సాహిత్యాన్ని వ్యాప్తి చేయడం వంటి కేసులు ఉన్నాయి.
కర్ణాటకలో చాన్నాళ్లుగా మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది. దాంతో.. ఆమె కర్ణాటక నుంచి తప్పించుకుని వచ్చి ఏపీలో తలదాచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వివిధ కారణాలతో ఇటీవల లొంగిపోవాలని నిర్ణయించుకున్న లక్ష్మీ.. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సరెండర్ కమిటీని సంప్రదించారు. ఆమె వెంట రాష్ట్ర నక్సల్ సరెండర్ కమిటీ సభ్యుడు శ్రీపాల్, ఆమె భర్త, 2020లో ఆంధ్రప్రదేశ్‌లో లొంగిపోయిన మాజీ నక్సలైట్ సలీం ఉన్నారు.
కర్ణాటక ప్రభుత్వం సరెండర్ ప్రోటోకాల్, ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తాను లొంగిపోవాలనుకున్నట్లు తెలిపిన లక్ష్మీ.. కొన్ని కారణాలతో అది జరగలేదని తెలిపారు. ఇప్పుడు సరెండర్ కమిటీ వేయడంతో తన లొంగుబాటు సులభమైందని లొంగిపోయిన తర్వాత లక్ష్మి అన్నారు. అనంతరం.. కుందాపూర్ తాలూకాలోని అమాసేబైల్, శంకరనారాయణలోని పోలీస్ స్టేషన్లలో తనపై పెట్టిన అన్ని అభియోగాల నుంచి విముక్తి కల్పించాలని జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేసారు.
లొంగిపోయిన లక్ష్మి ‘ఏ’ కేటగిరీ అభ్యర్థి కిందకు వస్తుందని, సరెండర్ ప్యాకేజీ ప్రకారం ఈ కేటగిరీ కింద వచ్చే నక్సలైట్లకు రూ.7 లక్షలు పొందేందుకు అర్హులని డీసీ విద్యా కుమారి తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన నక్సల్స్‌కు ‘ఎ’ కేటగిరీ డినామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే.. సరెండర్ ప్యాకేజీలు దశల వారీగా మూడేళ్ల పాటు అందిస్తామన్నారు. దాంతో పాటే.. లొంగిపోయిన నక్సల్స్ సామర్థ్యాన్ని బట్టి.. విద్య, పునరావాసం, ఉపాధి వంటి సౌకర్యాలు అందించనున్నారు.
రాష్ట్ర సరెండర్ కమిటీ శ్రీపాల్ మాట్లాడుతూ లొంగిపోయిన నక్సలైట్లపై నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సమాజంలో సాధారణ జీవనం సాగించేందుకు కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని తెలిపారు. కమిటీ ప్రయత్నాల కారణంగా.. 2025లో ఇప్పటివరకు 22 మంది నక్సల్ కార్యకర్తలు లొంగిపోయారు. వీరిలో లక్ష్మి లొంగిపోయిన చివరి మావోయిస్ట్ అని తెలిపారు. ఈమె లొంగుబాటుతో కర్నాటక ఇప్పుడు నక్సల్ రహిత రాష్ట్రంగా అవతరించిందని ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : కోల్‌కతా ఆర్జీకర్ కాలేజీలో ఉద్రిక్తత.. మరో MBBS విద్యార్ధి బలి
రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరెండర్ కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో లొంగిపోయే వారికి మార్గం సుగమం కావడంతో ఇటీవల అనేక మంది మావోలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కాగా.. ఈ లొంగుబాట్లకు కృషి చేసిన సరెండర్ కమిటీ సభ్యులైన పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి అవార్డులను అందించనుంది.