Renault Triber Turbo: కాంపాక్ట్ MPV కొనాలని చూస్తున్న వారికి రెనాల్ట్ కీలక అప్‌డేట్ తీసుకొచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ట్రైబర్ టర్బో ఎట్టకేలకు భారత మార్కెట్లోకి వచ్చింది. పెట్రోల్ వెర్షన్ తో పోలిస్తే మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.7.84 లక్షల నుంచి ప్రారంభమై రూ.8.99 లక్షల వరకు ఉన్నాయి.
ట్రైబర్ టర్బోలో 1.0 లీటర్, మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇదే ‘HR10’ ఇంజిన్ ను రెనాల్ట్ కైగర్, డస్టర్ 1.0 వేరియంట్లలో కూడా అందిస్తోంది. అయితే ట్రైబర్ కోసం ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో మార్పులు చేయడంతో టార్క్ అవుట్ పుట్‌ను 180Nmకు పెంచారు. ఇంజిన్ గరిష్టంగా 100hp పవర్, 180Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 10.8 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఇంజిన్ ను 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే అందిస్తున్నారు. త్వరలో CVT ఆటోమేటిక్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ట్రైబర్ టర్బోను ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో ఎమోషన్ టర్బో ధర రూ.8.99 లక్షలు. అదే సమయంలో సాధారణ ట్రైబర్ వేరియంట్ల ధరలు రూ.5.80 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే వేరియంట్‌ను బట్టి టర్బో వెర్షన్ కోసం అదనంగా సుమారు రూ.94,000 నుంచి రూ.1.11 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. డ్యూయల్ టోన్ పెయింట్ కోసం అదనంగా రూ.21,000 చెల్లించాలి.
టర్బో వెర్షన్ ను చూసిన వెంటనే గుర్తించేలా భారీ డిజైన్ మార్పులు చేయలేదు. ముందు భాగంలో గ్లాస్ బ్లాక్ గ్రిల్, కొత్త రెనాల్ట్ లోగో, LED హెడ్‌ల్యాంప్స్, DRLs ఉన్నాయి. బంపర్ కింది భాగంలో సిల్వర్ ఫినిష్‌తో కూడిన ఎయిర్ డామ్ కనిపిస్తుంది. 15 అంగుళాల వీల్స్ కు అల్లాయ్ వీల్స్ తరహాలో కనిపించే డ్యూయల్ టోన్ వీల్ కవర్లు ఇచ్చారు. గ్లాస్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్, ORVMలు కూడా ఉన్నాయి. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్‌ను గ్లాస్ బ్లాక్ ట్రిమ్‌తో కలిపారు. టెయిల్‌గేట్‌పై ఉన్న ‘TURBO’ బ్యాడ్జ్ ఈ వేరియంట్‌కు ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది.
ట్రైబర్ టర్బోలో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉన్నాయి. 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక బ్లోయర్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత విషయంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, TPMS, ISOFIX మౌంట్‌లు లాంటి ఫీచర్లు ఉన్నాయి. టర్బో వెర్షన్‌కు అనుగుణంగా ABS, ESC, ట్రాక్షన్ కంట్రోల్ వ్యవస్థలను కూడా రెనాల్ట్ రీట్యూన్ చేసింది. రెనాల్ట్ ట్రైబర్‌కు కాంపాక్ట్ MPV విభాగంలో నిస్సాన్ గ్రావైట్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది.
Read Also: కారుపై కనిపించే చిన్న ఫిన్.. దీని ఉపయోగాలేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!