Lucknow Shooting: యూపీలోని లక్నో నగరంలో గురువారం (ఆగస్టు 20) మధ్యాహ్నం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగి.. తన భార్య, చెల్లిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆపై తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిమిషాల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ మూడు మరణాలు.. నగరంలో తీవ్ర కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
లక్నోలోని గోమతీ నగర్ లో ఉన్న ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ ఎదుట ఈ దారుణం చోటుచేసుకుంది. ఎస్బీఐ ఉద్యోగి అయిన మనస్ వాజ్‌పేయి (38).. తన భార్య దివ్య మిశ్రా పనిచేస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఆమెను బ్యాంక్ నుంచి బయటకు పిలిచి కొద్ది నిమిషాలు మాట్లాడారు. అనంతరం ఒక్కసారిగా తన వద్ద ఉన్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన దివ్యను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
SBI Employee Shoots Wife Outside ICICI Bank In Lucknow, Kills Sister, Then Self Manas Vajpayee, before killing himself, had put a WhatsApp status announcing that he had killed his wife and sister. pic.twitter.com/mToNJZkO5f
— Shakeel Yasar Ullah (@yasarullah) August 20, 2026
భార్యను కాల్చిన తర్వాత మానస్ నేరుగా తన ఇంటికి చేరుకున్నారు. అక్కడ మానసిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తన చెల్లెలు శివ వాజ్‌పేయి (28)పై కూడా కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు.
అయితే ఆత్మహత్యకు ముందు మానస్ తన వాట్సాప్ స్టేటస్‌లో హత్యల గురించి ప్రస్తావించారు. ‘నన్ను మోసం చేసిన నా భార్యను ఈ రోజు చంపేశాను. ఇప్పుడు నేను, నా చెల్లెలు కూడా చనిపోవాల్సి వస్తోంది. ఈ విషయం ఆమె సోదరి ప్రజ్ఞ, భరత్‌లకు పూర్తిగా తెలుసు’ అని అతడు అందులో రాసుకొచ్చాడు.
ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. మానస్ మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో కంగారుగా, విపరీతమైన చెమటలతో ఇంటికి వచ్చారు. లోపలికి వెళ్లిన వెంటనే హనుమాన్ చాలీసా ప్లే చేశాడు. ఆ తర్వాత అతని వాట్సాప్ స్టేటస్ చూసిన పొరుగు వ్యక్తి అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా.. మానస్ శవమై కనిపించాడు.
Also Read: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రోబోట్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే మానస్, దివ్యలకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే గడచిన ఏడాది కాలంగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. దివ్య గతేడాది విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించింది. కాల్పుల ఘటన అనంతరం దివ్య సోదరి ప్రజ్ఞ మిశ్రా.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన సోదరిపై కాల్పులు జరిగాయని లహియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఆమె కోసం ప్రార్థించాలని కోరారు. కాగా ప్రస్తుతం లక్నో పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: దక్షిణ మండలి సమావేశం.. అమిత్ షాకు విజయ్ సహా.. సౌత్ సీఎంలు కీలక ప్రతిపాదనలు!