Mahakumbhmela Stampede Minister | ప్రయాగ్రాజ్‌లోని మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట వల్ల 30 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక సమాచరం. ఈ ఘటనపై మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ వివరాలు అందించారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్య రెండు ప్రదేశాలలో తొక్కిసలాట జరిగిందని, బారికేడ్లు విరిగిపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 25 మంది మృతులను గుర్తించగా, మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనలో 60 మంది గాయపడ్డారని కూడా డీఐజీ తెలిపారు. కుంభమేళాకు ఈ రోజు వీఐపీలెవరికీ అనుమతి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్‌లో ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, హెల్ప్‌లైన్ నంబర్ 1920 ద్వారా సహాయం పొందాలని సూచించారు.
ఈ ఘటన వల్ల ప్రయాగ్రాజ్ ఆస్పత్రులు బాధితుల కుటుంబాల రోదనలతో నిండిపోయాయి. తమ బంధువులు కనిపించకపోవడంతో కొందరు హెల్ప్ సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ ఘటన సమయంలో ప్రజలు బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ దుర్ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే ఇలాంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు. “కుంభమేళా కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడకు వచ్చే జనసమూహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడినప్పుడు ఎక్కడో చోట చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి” అని ఆయన అన్నారు. ఈ ఘటనపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుకున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో నిషాద్ పార్టీ వ్యవస్థాపకుడు సంజయ్ నిషాద్, యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు. మహాకుంభమేళా నిర్వహణపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన విమర్శలకు సంజయ్ నిషాద్ స్పందించలేదు.
Also Read: కుంభమేళా తొక్కిసలాట.. కారణాలు ఇవే..
మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద బుధవారం వేకువజామున పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో రద్దీ విపరీతంగా పెరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధానమంత్రి బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీసినట్లు తెలిపారు.
తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా, ప్రస్తుతం అక్కడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. అఖాడాల (సాధువులు) స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌ల వద్ద ఈ ఘోరం జరిగింది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లడంతో బారికేడ్లు విరిగిపోయాయి. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వారి మీద నుంచే మిగతా వారు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని నిర్ణయించారు. “ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. జస్టిస్ హర్ష్ కుమార్ సారథ్యంలో కమిషన్ దర్యాప్తు జరుపుతుంది” అని ఆయన తెలిపారు. ఈ కమిషన్‌లో మాజీ డీజీ వీకే గుప్తా మరియు రిటైర్డ్ ఐఏఎస్ డీకే సింగ్ సభ్యులుగా ఉంటారని కూడా తెలిపారు.
ఈ ఘటనలో మృతుల్లో నలుగురు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరు తల్లీ కూతురు కాగా, మరో ఇద్దరు శెట్టి గల్లీ, శివాజీ నగర్‌లకు చెందిన వారుగా నిర్ధారించారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రయాగ్రాజ్‌కు సీనియర్ అధికారుల బృందాన్ని పంపిస్తున్నట్లు బెళగావి ఎమ్మెల్యే ఆసిఫ్ సియాత్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బెళగావి నుంచి దాదాపు 300 మంది కుంభమేళాకు వెళ్లినట్లు స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు.