Mark Zuckerberg Lok Sabha Summons| సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేయనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను వక్రీకరిస్తూ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం సృష్టించాయి. దీనిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుని, ఆయనకు సమన్లు పంపాలని నిర్ణయించింది. బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానల్ చైర్మన్ నిషికాంత్ దూబే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
జుకర్‌బర్గ్ ఇటీవలే జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను వక్రీకరిస్తూ వ్యాఖ్యానించారు. ఆయన పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. “భారత దేశం సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు ఓడిపోయాయి. కోవిడ్ సమయంలో భారత ప్రభుత్వం పనితీరు సరిగా లేనందునే ఇలాంటి ఫలితాలు వచ్చాయని ,” అని చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను ఖండించింది. జుకర్‌బర్గ్ చెప్పిన మాటలు అసత్యమైనవిగా, దాదాపు ప్రజాస్వామ్య దేశాల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయని భారత ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మెటాకు సమన్లు పంపించాలని అధికారికంగా తెలిపారు. “ఈ తప్పుడు వ్యాఖ్యల వల్ల ప్రజాస్వామ్య దేశాల ప్రతిష్టకు భంగం కలిగిందని ,” అన్నారు. జుకర్‌బర్గ్ చేసిన వాదనతో.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ పై అనవసరమైన అపోహలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అందుకే, “భారత దేశ ప్రజలకు, చట్టసభ సభ్యులకు జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పాలని” ఆయన డిమాండ్ చేశారు.
Also Read: టిక్ టాక్ ఇక మస్క్ చేతికి?.. విక్రయించే యోచనలో చైనా
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా జుకర్‌బర్గ్ వ్యాఖ్యలను ఖండిస్తూ, “భారత్ లో 64 కోట్ల మంది ఓటర్లు పాల్గొని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ పట్ల విశ్వాసం చూపించారు,” అని పేర్కొన్నారు. “కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఉచిత ఆహారం, 220 కోట్ల వ్యాక్సిన్లు అందించడం, ప్రపంచ దేశాలకు సాయం చేయడం.. భారత ప్రభుత్వం ఈ కార్యాలను విజయవంతంగా నిర్వర్తించినందుకే మోదీ నాయకత్వంలోని కూటమి మూడోసారి విజయం సాధించడానికి ముఖ్య కారణాలయ్యాయి,” అని చెప్పారు.
జుకర్‌బర్గ్ జనవరి 10న జో రోగన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, “2024 సంవత్సరంలో భారత్‌తో సహా ఎన్నో దేశాల్లో ఎన్నికలు జరిగాయి. కానీ అక్కడి ప్రభుత్వాలు ఓడిపోయాయి. దీనికి కారణం, ఆయా ప్రభుత్వాలు కరోనాతో డీల్ చేసిన విధానం మరియు ఆర్థిక పరిస్థితులు,” అని పేర్కొన్నారు.
ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నిర్వహించే మెటా సంస్థ ఈ అంశంపై ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.