Muzaffarnagar Murder: ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్ నగర్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ రైతు హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. ఈ కేసును రెండున్నర రోజుల్లోనే ఛేదించిన పోలీసులు.. రైతు హత్యకు కట్టుకున్న భార్యనే సుపారీ ఇచ్చినట్లు నిర్ధారించారు. తన వివాహేతర బంధాన్ని అడ్డుగా ఉన్నాడన్న కోపంతో ఈ హత్యకు భార్య స్కెచ్ వేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ముజఫర్ నగర్‌కు చెందిన ప్రవీణ్ అలియాస్ పర్విందర్ (52) అనే రైతు సెప్టెంబర్ 27న సమీపంలోని అడవిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఆయన శరీరంలో రెండు బుల్లెట్లు దిగి ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా విచారణ జరపగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ప్రవీణ్ భార్య రేఖకు దగ్గరి బంధువైన వికాస్ అనే కాంట్రాక్టర్‌తో 2018-19 నుంచే అక్రమ సంబంధం ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించగా విషయం తెలిసి ప్రవీణ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో ప్రవీణ్‌ను ఎలాగైనా మట్టుబెట్టాలని రేఖ, వికాస్‌లు పథకం వేశారు.
భర్తను చంపేందుకు అవసరమైన డబ్బు కోసం రేఖ తనకు ఉన్న ఒక ల్యాండ్‌ను రూ.10 లక్షలకు విక్రయించింది. ఆ డబ్బును వికాస్ కు అప్పగించింది. వికాస్ ఆ డబ్బును.. రాజా, కళ్యాణ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులకు రూ.3 లక్షల చొప్పున సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర పన్నాడు. రాజాకు ఇప్పటికే ప్రవీణ్‌తో రూ.1.5 లక్షల ఆర్థిక లావాదేవీల వివాదం ఉండటంతో అతడు వెంటనే ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు.
పథకం ప్రకారం సెప్టెంబర్ 27న ప్రవీణ్‌ను అడవిలోకి పిలిపించారు. అక్కడ ముందే వేచి ఉన్న రాజా, కళ్యాణ్ సింగ్‌లు ప్రవీణ్‌పై చెరో తుపాకీతో కాల్పులు జరిపి అక్కడికక్కడే హత్య చేసి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా ఆధారాలతో రేఖ, వికాస్, రాజా, కళ్యాణ్ సింగ్‌లను అరెస్టు చేశారు.
Also Read: BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!
హత్య కోసం ఉపయోగించిన కొత్త మొబైల్ ఫోన్, సిమ్ కార్డుతో పాటు మొత్తం నాలుగు ఫోన్‌లు, ఒక స్విఫ్ట్ కారు, ప్రవీణ్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి సంజయ్ కుమార్ వర్మ తెలిపారు. అలాగే నిందితుల వద్ద నుంచి రెండు నాటు తుపాకీలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై భారతీ యన్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1), 3(5), 61(2) తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు అధికారి వివరించారు.
Also Read: Airtel యూజర్లకు ఊహించని గిఫ్ట్.. ఏడాది ప్లాన్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్రీగా 150GB డేటా!