Google Fitbit Air: స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్‌నెస్ బ్యాండ్‌లు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వాటి డిస్‌ప్లే. అయితే నోటిఫికేషన్ల గోల లేకుండా, కేవలం ఆరోగ్యంపైనే శ్రద్ధ పెట్టాలనుకునే వారి కోసం గూగుల్ ఒక సరికొత్త పరికరాన్ని ఇండియాలోకి తీసుకువచ్చింది. అదే ‘గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్’. కంపెనీ నుంచి వచ్చిన మొదటి స్క్రీన్ లేని ఫిట్‌నెస్ ట్రాకర్ ఇది. ఎలాంటి స్క్రీన్ లేకపోవడం వల్ల అనవసరమైన మెసేజ్‌లు, అలర్ట్‌లతో దృష్టి మరల్చకుండా ఇది పని చేస్తుంది. మే నెలలోనే గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ ప్రొడక్ట్.. ఇప్పుడు భారత్‌లో అడుగు పెట్టింది. అక్టోబర్ 2 నుంచి ఈ డివైజ్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
భారత్‌లో Google Fitbit Air ధరను రూ.13,999గా నిర్ణయించారు. ఇది అబ్సిడియన్, బెర్రీ, లావెండర్, ఫాగ్ అనే 4 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. దీంతో పాటు మూడు నెలల గూగుల్ హెల్త్ ప్రీమియం ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే 12 నెలల నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్ కూడా ఉంది. గూగుల్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.9,500 వరకు ఉంది.
Also Read: మన ఆరోగ్యాన్ని AIతో ట్రాక్ చేసే పెబుల్ కొత్త బ్యాండ్.. ధర కూడా తక్కువే!
Google Fitbit Airలో స్క్రీన్ లేకపోయినా హెల్త్ ఫీచర్లకు కొదవ లేదు. రోజంతా గుండె వేగాన్ని కనిపెట్టే హార్ట్ రేట్ ట్రాకింగ్, గుండె లయలో మార్పులను గుర్తించే ఫీచర్ ఇందులో ఉన్నాయి. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కొలిచే ఎస్‌పిఓ2 సెన్సార్, నిద్ర నాణ్యతను అంచనా వేసే స్లీప్ ట్రాకింగ్ సదుపాయాలు ఉన్నాయి. మనం చేసే వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. కావాలనుకుంటే మనం రోజువారీ వర్కౌట్లను మ్యాన్యువల్‌గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని చాలా సులభతరం చేస్తాయి.
ఈ డివైజ్ అతిపెద్ద ప్లస్ పాయింట్ బ్యాటరీ లైఫ్. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా వారం రోజుల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, ఒక రోజంతా హ్యాపీగా వాడేయవచ్చు. రోజువారీ ఛార్జింగ్ తలనొప్పి లేకుండా ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసుకోవడానికి ఇది సరైన ఛాయిస్.
స్క్రీన్ లేకపోవడంతో ఇది చేతికి ఒక సాధారణ, స్టైలిష్ బ్యాండ్‌లా కనిపిస్తుంది. దీనికోసం పెర్ఫార్మెన్స్ లూప్, యాక్టివ్, ఎలివేటెడ్ మోడర్న్ అని రకరకాల బెల్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. మన దుస్తులకు తగ్గట్టు బెల్ట్‌లను సులభంగా మార్చుకోవచ్చు. రోజంతా వేసుకున్నా బరువు అనిపించకుండా చాలా తేలికగా ఉంటుంది. సాంకేతికతను, ఫ్యాషన్‌ను ఇష్టపడే వారికి ఈ ఫిట్‌బిట్ ఎయిర్ ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
Also Read: మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ నిజమేనా? కేంద్రం క్లారిటీ, సుప్రీంకోర్టు కీలక సూచనలు!