Navneet Rana Maharashtra| బిజేపీ నాయకురాలు, మహారాష్ట్ర అమరావతి మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా.. ఎన్నికల ర్యాలీ కార్యక్రమంలో అల్లరి మూకలు దాడి చేశాయి. శనివారం సాయంత్రం అమరావతిలో జరిగిన ఈ ఘటనలో కొందరు యువకులు కుర్చీలు విసిరారు. ఆమె అనుచరులపై దాడి చేశారు. దీంతో మాజీ ఎంపీ నవనీత్ రాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బిజేపీ నాయకురాలు నవనీత్ రాణా అమరావతిలోని ఖల్లార్ గ్రామంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. అక్కడ దర్యాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజేపీ అభ్యర్థి రమేష్ బుందిలే కు మద్దతుగా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు.
పోలీసులకు నవనీత్ రాణా డెడ్ లైన్
ఫిర్యాదు చేసిన తరువాత మాజీ ఎంపీ నవనీత్ రాణా మీడియాతో మాట్లాడారు. “పోలీసులు త్వరగా చర్యలు చేపట్టాలి.. దోషులను 48 గంటల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నా.. లేకపోతే మా కార్యకర్తలు కూడా దాడి చేసిన వారిపై తగిన రీతిలో సమాధానం చెబుతారు. ఎవరినీ అరెస్టు చేయకపోతే అమరావతిలోని మొత్తం హిందూ సమాజం ఇక్కడ ఏకమవుతుంది.” అని హెచ్చరించారు.
Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్
శాంతియుతంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే దాడి చేస్తారా?
దాడి ఘటన గురించి నవనీత్ రాణా మీడియాకు వివరించారు. “మేము శాంతియుతంగా ఖల్లార్ గ్రామంలో ప్రచారం చేసుకుంటున్నాం. ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఒక వేదిక ఏర్పాటు చేశారు. నేను వేదికపైకి వెళుతుండగా.. కొందరు మతపరమైన నినాదాలు చేశారు. నా గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. బిజేపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఇలాంటి నినాదాలు ఇవ్వకూడదని వారించారు. కానీ ఆ అల్లరి మూకలు ఇంకా రెచ్చినపోయారు. నేను కూడా వేదిక పై నుంచి అందరినీ శాంతియుతంగా కూర్చోవాలని కోరాను. ఇదంతా సాయంత్రం 5 గంటల సమయంలో జరిగింది. మా పార్టీ కార్యకర్తలపై ఆ అల్లరి మూకలు దాడి చేశారు. కుర్చీలు విసిరారు. మరి కొందరు కుర్చీలు విరగ్గొట్టారు. దీని వల్ల అక్కడున్న దివ్యాలంగులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇదంతా ఉద్ధవ్ ఠాక్రే అనుచరులే చేశారని నాకు తెలిసింది. ఈ తాలుకా ప్రెసిడెంట్.. ఉద్ధవే ఠాక్రేకి అభిమాని. ఆయన ఇదే గ్రామంలో నివసిస్తున్నాడు. ఆయన అనుచరులే ఇదంతా చేశారు. వారు ఒకటి చేస్తే.. మేము రెండు చేస్తాం. వారి భాషలోనే సమాధానం చెబుతాం. అప్పుడే వారికి అర్థమవుతుంది.
బిజేపీ ప్రచార కార్యక్రమంలో హింస చెలరేగడంపై స్థానిక పోలీస్ అధికారిక కిరణ్ వంఖాడే స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. “ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలు హింసకు పాల్పడ్డాయి. కానీ అక్కడ పోలీసుల భద్రత ఉండడంతో త్వరగా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. నవనీత్ రాణా ఫిర్యాదు నమోదు చేశారు. ఎన్నికల దృష్ట్యా ఖల్లార్ గ్రామంలో హింసాత్మక ఘటనలు జరగకుండా ఒక పోలీస్ చెక్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాడి ఘటనలో విచారణ చేస్తున్నాం. మొత్తం 45 మందిపై ఫిర్యాదు నమోదు చేశారు. వీరిలో 5 మందిని గుర్తించి అరెస్టు చేశాం. ప్రజలు ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు.” అని అమరావతి రూరల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ వాంఖడే అన్నారు.