Police Protection Love Marriage| ప్రేమికులకు ఓ రాష్ట్ర హై కోర్టు భారీ షాకిచ్చింది. ప్రేమ వివాహాలు చేసుకుంటే ఆ సౌలభ్యం ఉండదని తీర్పు చెప్పింది. దీంతో ఆ హై కోర్టు తీర్పు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ కేసులో విచారణ చేసిన అలహాబాద్ హై కోర్టు తీర్పు వెలువరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు పోలీసు భద్రత లభించదని చెప్పింది. ఆ నవ దంపతులకు ప్రాణహాని నిజంగా ఉందని, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రమాదం ఉందని నిరూపిస్తేనే లభిస్తుందని చెప్పి సంచలన తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువ ప్రేమ జంట నూతనం వివాహం చేసుకొని తమకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని తల్లిదండ్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని తెలుపుతూ అలహాబాద్ హై కోర్టు లో పిటీషన్ వేశారు. వారి పిటీషన్ విచారణ చేసిన హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌరభ్ శ్రీవాస్తవ ఈ విధంగా స్పందించారు. ‘‘మీరు ప్రేమించుకున్నారు, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఎందుకు పోలీస్ భద్రత కల్పించాలి? మీరు ప్రేమ వివాహం చేసుకున్నారని మాత్రమే చెప్పి తల్లిదండ్రుల నుంచి ముప్పు ఉందంటూ భద్రత కోరడం సమంజసం కాదు. మీ జీవితానికి లేదా స్వేచ్ఛకు నిజమైన ముప్పు ఉందని మేము భావించినప్పుడు మాత్రమే మిమ్మల్ని రక్షించేందుకు పోలీసులు ముందుకు వస్తారు,’’ అని స్పష్టం చేశారు.
అంతే కాదు.. ఆ దంపతులు నిజంగా ఒకరికి మరొకరు తోడుగా నిలబడాలనుకుంటే ముందు సమాజాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఆర్థికంగాను స్థిరపడాలి. ప్రేమ అంటే బాధ్యత కూడా. అంతేకానీ ఎదుటివారిపై నిందలు వేయడం కాదు అని న్యాయూమూర్తి వ్యాఖ్యానించారు.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
దంపతులు తమ పిటిషన్‌లో పేర్కొన్న విషయాలను పరిశీలించిన తర్వాత, వారి ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదని, వారి కుటుంబ సభ్యులు వారిపై మానసికంగా లేదా శారీరకంగా హాని చేసే అవకాశాలు లేవని కోర్టు పేర్కొంది. దాంతో పాటు, ఎటువంటి బెదిరింపులు వస్తున్నాయని సంబంధిత పోలీసులకు ముందుగా ఫిర్యాదు చేయకుండా, నేరుగా కోర్టును ఆశ్రయించడం కూడా సరైన పద్ధతి కాదని పేర్కొంది. భద్రత కల్పించమని పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలు చేసిన వారి పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది.
అయితే, జిల్లా ఎస్పీకి రక్షణ కోసం ఒక వినతి పత్రాన్ని దంపతులు ఇచ్చిన విషయాన్ని కోర్టు గమనించింది. ఆ మేరకు, అవసరమైతే పోలీసులు చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది.