Sophia Qureshi’s father: వయస్సు 75 ఏళ్లు. గుండె నిండా దేశభక్తి. మాటల్లో మంట, చూపులో పగ. వయస్సు కాదు.. గుండెల్లో దేశభక్తి ఉంటే చాలు, పోరాటానికి ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధం. అంతెందుకు నన్ను వదలండి.. పాక్ ను పిప్పి చేసి వీరమరణం పొందుతా అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈయన వృద్ధుడే కావచ్చు, ఆషామాషీ మనిషి కాదు. ఈయన చరిత్ర తెలుసుకుంటే ఔరా అనేస్తారు. ఇంతకు ఈయన ఎవరు అనుకుంటున్నారా.. ఆయనే మాజీ సైనికుడు తాజ్ మోహమ్మద్ ఖురేషీ.
ఎవరు ఈ మొహమ్మద్ ఖురేషీ?
ఆపరేషన్ సింధూర్ తో పాక్ ను గడగడలాడించిన శుభవార్తను మన ముందు చెప్పిన లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ గుర్తున్నారుగా.. ఆమె తండ్రే ఈ మొహమ్మద్ ఖురేషీ. వీరి కుటుంబం మొత్తం సైన్యంలో సేవలు అందించిన వారే. భారతదేశపు గడ్డ కోసం ప్రాణాలు అర్పించేందుకు ఈ కుటుంబం ఎప్పుడూ సిద్ధమే. తాజ్ మోహమ్మద్ ఖురేషీ భారత సైన్యంలో సేవలందించిన మూడవ తరం సైనికుడు. ఈయన తండ్రి, తాత కూడా భారత సైన్యంలో సేవలందించారు. తాజ్ మోహమ్మద్ ఖురేషీ, ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇంజినీర్స్ కార్ప్స్‌లో పనిచేశారు. అంతేకాదు 1971 యుద్ధంలో సైతం పాల్గొన్నారు. ఆ యుద్ధం భారత్ – పాక్ మధ్యనే సాగింది. ఆ సమయంలో మొహమ్మద్ ఖురేషీ తుపాకీ చేతబట్టి పాక్ సైనికులపై విరుచుకుపడ్డారు.
గర్వపడుతున్నా..
ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా సమావేశంలో కర్నల్ సోఫియా ఖురేషీ మాట్లాడిన మాటలు విన్న తాజ్ మోహమ్మద్ ఖురేషీ తెగ సంబర పడ్డారు. ఆయన మాట్లాడుతూ మొదట భారతీయులం, తర్వాత హిందువులు లేదా ముస్లింఅన్నారు. మొదట భారత్ – తర్వాత మతం అన్న ఆయన మాటలు, సామరస్యానికి నిలువెత్తు సాక్ష్యమని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వదిలితే.. పాక్ ను పిప్పి చేస్తా
వయస్సు శరీరానికి మాత్రమే, నాలోని దేశభక్తికి కాదని మొహమ్మద్ ఖురేషీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒక సంచలనమే. తనను ఇప్పుడైనా యుద్ధానికి పంపిస్తే, ఇప్పుడైనా రెడీ అంటూ ఖురేషీ అన్నారు. పాక్ కు గట్టి బుద్ధి చెప్పడంలో మన సైన్యం పైచేయి సాధించిందని ఆయన అన్నారు.
నాల్గవ తర వారసురాలు సోఫియా ఖురేషీ
గుజరాత్‌లోని వడోదరకు చెందిన మొహమ్మద్ ఖురేషీ మిలటరీ కుటుంబ నేపథ్యం కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరి కుటుంబంలో నాల్గవ తరం వారసురాలిగా సోఫియా ఖురేషీ నిలిచారు. ఈమే కెమిస్ట్రీలో పీజీ చేసినా, 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చేరారు. 2006 నుంచి ఆరేళ్లపాటు ఐక్యరాజ్యసమితి శాంతిదళంలో భారత్ తరఫున పనిచేశారు. 2016లో 18 దేశాల సైనిక కవాతులో భారత ఆర్మీ కంటింజెంట్‌కు నేతృత్వం వహించారు.
Also Read: Operation Sindoor Updates: బోర్డర్‌లో మోహరించిన బలగాలు.. ఏడుగురు ఉగ్రవాదులు హతం
మొత్తం మీద ఖురేషీ మాట్లాడిన మాటలను యావత్ దేశం ప్రశంసిస్తోంది. తమ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు ఎప్పుడూ సిద్ధమని, అందుకోసం ఒక అడుగు ముందుకే ఉంటుందని ఖురేషీ చేసిన కామెంట్స్ ఆయన దేశభక్తికి నిదర్శనం. ఈ కుటుంబం ఇంకా వెయ్యేళ్లు దేశసేవలో ఉండాలని కోరుకుంటూ, చివరగా మన దేశ సైన్యానికి, ఇలాంటి వీరులకు సెల్యూట్ చేద్దాం.