Simla Agreement: పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల హింసాత్మక దాడితో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఘటన వార్త విన్న దేశ ప్రజలు షాక్ కు గురయ్యారు. అమాయక టూరిస్టులపై విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 27 మంది అక్కడికక్కడే చనిపోవడం దేశ ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే రక్షణ దళాలు, కశ్మీర్ పోలీసులు, పారా మిలిటరీ దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కదలికలపై పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దేశ ప్రజలు ఉగ్రవాదులపై ఫైరవుతున్నారు. వారిని ఎక్కడున్నా దొరకపట్టి కఠినంగా శిక్షంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రక్షణ దళాలను కోరుతున్నారు.
అయితే, పహల్‌గామ్ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ తీరుపై భారత ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఆ దేశంలో దౌత్య సంబంధాలను పూర్తి తెంచుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటారీ చెక్ పోస్టును కూడా వెంటనే నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇక పాక్ పౌరులను భారత్ లోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పాకిస్థాన్ కూడా మన దేశంపై ప్రతీకార చర్యలకు దిగుతోంది. వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది. గతంలో చేసుకున్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో అతి ముఖ్యమైన చారిత్రక సిమ్లా ఒప్పందం ఉంది. పాకిస్థాన్ గగనతలాన్ని కూడా భారత విమానాలకు నిరాకరించింది. వాఘా సరిహద్దును మూసేస్తూ నిర్ణయం తీసుకుంది.
అసలు సిమ్లా ఒప్పందం ఏంటి..?
1971లో ఇండో-పాక్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే లక్ష్యంతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. పాక్ పై భారత్ విజయం సాధించి, బంగ్లాదేశ్ ఏర్పడడానికి దోహదపడింది. యుద్దం తర్వాత సంబంధాలను పునరుద్ధరించేందుకు సిమ్లా ఒప్పందం మార్గం సుగమం చేసింది.
ఒప్పందంలో కీలక సూత్రం ఏంటంటే..?
1972 జులై 2న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయిన జుల్ఫికర్ అలీ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య తలెత్తే వివాదాలను శాంతియుతంగా, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది ఈ ఒప్పందంలోని కీలక సూత్రం. మూడో పక్షం జోక్యం లేకుండా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగానే కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ (LOC) ఏర్పాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను భారతదేశం- పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ (LOC)గా మార్చడం జరిగింది. దీన్ని ఏకపక్షంగా మార్చరాదని రెండు దేశాలు అంగీకరించాయి. ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని, పరస్పర ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని కూడా ఒప్పందంలో స్పష్టంగా ఉంది.
సిమ్లా ఒప్పందం రద్దు చేస్తే ఏమవుతోంది..?
రెండు దేశాల యుద్ధ ఖైదీలు తిరిగి రావడం, ప్రత్యక్ష చర్చల ద్వారా భవిష్యత్ వివాదాలను పరిష్కరించుకుంటామని ఒప్పందంలో పేర్కొన్నారు. దీని అర్థం ఏంటంటే..? కాశ్మీర్ సహా చాలా విషయాలకు సంబందించి ఎవరి జోక్యం లేకుండా పరిష్కరించుకోవాలన్నదే దీని ఉద్దేశం. అంటే ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తే.. మూడో దేశం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో రెండు దేశాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు ఐక్యరాజ్యసమితి సైతం చర్చించేందుకు ముందుకు రాలేదు.
అయితే, భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకున్న క్రమంలోనే పాక్ సిమ్లా ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. సిందు జలాలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. దీన్ని జలయుద్ధంగా అభివర్ణించింది.
Also Read: 20 Lakhs Reward: ఆ రాక్షసులను పట్టిస్తే.. రూ.20 లక్షలు, చిన్న లీడ్ ఇచ్చినా చాలు!
Also Read: BMRCL Recruitment: టెన్త్ క్లాస్ అర్హతతో మెట్రోలో ఉద్యోగాలు.. జీతం రూ.59,000 భయ్యా..