ముంబై, స్వేచ్ఛ: స్వదేశీ టెక్నాలజీతో దేశ భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయాలనే లక్ష్యంలో కీలక ముందడుగు పడింది. బుధవారం ఒకే రోజు మూడు యుద్ధ నౌకలు నావికా దళంలో చేరాయి. ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ మూడు నౌకలను దేశీయంగా తయారు చేయగా అందులో ఎన్ఎస్ఎన్ సూరత్ డెస్ట్రాయర్ నౌక, ఐఎన్ఎస్ నీల్‌గిరి ఫ్రిగేట్ నౌక, మూడవదైన ఐఎన్ఎస్ వాఘ్షీర్ జలాంతర్గామి. ఈ విధంగా మూడు కేటగిరీల నౌకలను నేవీలో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. 77వ సైనిక దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో నౌకలను ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఇండో పసిఫిక్ ప్రాంతం రక్షణ, సమగ్రాభివృద్ధికి భారత్ ఎల్లప్పుడు బహిరంగ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఒకటి డెస్ట్రాయర్, మరొకటి ఫ్రిగేట్, ఒక జలాంతర్గాములను తొలిసారి ఒకేసారి అందించామని, ఈ మూడూ ‘మేడ్ ఇన్ ఇండియా’ అని మోదీ ప్రస్తావించారు.
‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమం దేశాన్ని దృఢంగా, స్వావలంబనగా మార్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ ప్రధాన నావికా దళ శక్తితో ఉద్భవిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో నమ్మదగిన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా రూపాంతరం చెందుతోందని ధీమా వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి ఇండో-పసిఫిక్ సముద్రాన్ని రక్షించాలని, భారత్ ప్రపంచ భాగస్వామిగా మారాలని ప్రధాని అభిలాషించారు. భారత్ తన సైనిక శక్తిని వృద్ధి చేసుకుంటోంది విస్తరణవాదం కోసం కాదని, సురక్షిత, వికాస శీలమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇండియన్ నేవీ ప్రపంచ దేశాలతో కలిసి సముద్ర జలాల మీదుగా డ్రగ్స్, ఆయుధ రవాణాను అడ్డుకుంటోందని, ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కీలక పాత్ర పోషించనుందని, నౌకాదళం రేయింబవళ్లు చేస్తున్న విశేష కృషితో భారత్ సురక్షిత స్థానంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు.
గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు
హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ‘ఫస్ట్ రెస్పాండర్’గా ఉద్భవించిందని ప్రధాన మంత్రి నరంద్ర మోదీ ప్రస్తావించారు. ప్రపంచ భద్రత, ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయ పరిణామాల్లో కీలక శక్తిగా అవతరించిందని, భారత్ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు. భారత్ కేవలం అభివృద్ధి కోసమే పనిచేస్తోందని, విస్తరణ కోసం కాదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములను నౌకాదళంలో ప్రవేశపెట్టిందని ఆయన గుర్తుచేశారు. దేశ రక్షణరంగ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటిందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి మాట్లాడుతూ కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకలో ప్రాజెక్ట్ 15ఏ, ప్రాజెక్ట్ 15బీ డెస్ట్రాయర్లు ఉన్నాయని తెలిపారు. ఐఎన్ఎస్ నీల్‌గిరి యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్లు ఉన్నాయని, వీటిని కలిగిన తొలి భారత యుద్దనౌక ఇదేనని ఆయన వివరించారు. ఐఎన్ఎస్ వాఘ్షీర్ యుద్ధనౌకలో ప్రాజెక్ట్ 75 జలాంతర్గాములు (సబ్ మెరైన్లు) ఉన్నాయని వెల్లడించారు. ఈ మూడు యుద్ధ నౌకల చేరికతో దేశ నౌకాదళం సామర్థ్యం మరింత బలోపేతం అయ్యిందని, హిందూ మహాసముద్రంలో భారతదేశ ప్రయోజనాలను రక్షించే క్రమంలో నౌకాదళం చేపట్టే ఆపరేషన్లకు ఈ యుద్ధ నౌకలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మూడు నౌకలు.. ఎంతో ప్రత్యేకం
భారత నేవీకి బుధవారం మూడు యుద్ధ నౌకలు అందుబాటులోకి రాగా దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంది. ఐఎన్‌ఎస్ సూరత్ నౌకలో పీ15బీ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు ఉన్నాయి. ఈ టెక్నాజీలతో తయారు చేసిన నాలుగవ యుద్ధనౌక ఇదే కావడం విశేషం. ప్రపంచంలో అత్యాధునిక డెస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి అని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ నౌక తయారీలో ఉపయోగించిన సాంకేతికతలో 75 శాతం స్వదేశీ టెక్నాలజీ కావడం విశేషం. అత్యాధునిక ఆయుధ సెన్సార్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి. పీ75 ప్రాజెక్టులో భాగంగా ఐఎన్ఎస్ వాఘ్షీర్ను తయారు చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో డెవలప్ చేశారు. ఇక ఐఎన్‌ఎస్ నీల్‌గిరి యుద్ధ నౌకలో పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్‌తో తయారు చేశారు. ప్రత్యర్థులను ఏమార్చే పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు.
Also Read: RSS దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోంది.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాహుల్ తీవ్ర విమర్శలు