PM Modi : విదేశీ అతిథుల పర్యటనల్లో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చాలా సాధారణం. ఒకదేశం నాయకులు మరో దేశ నాయకులకు ఖరీదైనా బహుమతులు బహుకరిస్తుంటారు. వాటిలో.. వారి అభిరుచులు, వారి దేశాలు, ప్రాంతాల ప్రత్యేకతల్ని తెలిపేలా ప్రత్యేకంగా రూపొందించిన గిఫ్ట్స్ ఇస్తుంటారు. అలా..వచ్చిన వాటిని ఆయా దేశ నాయకులు ఎంతో ఇష్టంతో అందుకుంటారు. అలా నాలుగేళ్లుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఎన్నో ఖరీదైన బహుమతులు అందుకున్నారు. కానీ.. వీటిలో ఎక్కువ విలువైన బహుమతి భారత్ నుంచి అందింది. ఈ విషయాన్ని తాజాగా.. అమెరికా అధికారులు వెల్లడించారు. దాంతో.. మోదీ ఏ బహుమతి ఇచ్చారు. దాని ప్రత్యేకతలు ఏంటి అనే విషయాల గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా..
అమెరికా – భారత్ మధ్య సంబంధాలు చాలా బాగుంటాయి. అధ్యక్షులు మారుతున్నా.. అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్నా.. నాయకుల మధ్య మాత్రం సత్సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. వీటిలో భాగంగానే ఇరు దేశాల అధినేతలు.. ఒకరి దేశంలో మరొకరు పర్యటిస్తుంటారు. ఆ సమయాల్లో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. వారికి ఇష్టమైన వస్తువుల్ని ఇస్తుంటారు. అలా.. 2023లో విదేశీ నాయకుల నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ లక్షల డాలర్ల బహుమతులు అందాయి. వాటిలో.. భారత ప్రధాని మోదీ అందించిన గిఫ్ట్ అన్నింటికంటే ఎక్కువ విలువైందిగా అధికారులు తెలిపారు. అవును.. 2023లో అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ.. వివిధ గిఫ్ట్స్ అందించగా.. అందులో జిల్ బైడెన్ కోసం 20 వేల డాలర్ల విలువైన వజ్రాన్ని అందిచారు. దీని విలువ మన కరెన్సీలో అయితే రూ.17 లక్షల 15 వేల వరకు ఉంటుంది.
జిల్ బైడెన్ కోసం ప్రధాని మోదీ 7.5 క్యారెట్ల వజ్రాన్ని బహుకరించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ రాయబారి నుంచి 14,063 డాలర్ల విలువైన బ్రూచ్ అనే ఆభరణాన్ని బహుకరించారు. వీటితో పాటే.. బ్రాస్ లైట్లు, ఫోటో గ్రఫీ ఆల్బమ్ వంటివి ఈజిప్ట్ అధ్యక్షుడు, ఆయన సతీమణి నుంచి బైడెన్, జిల్ బైడెన్ అందుకున్నారు. ఈ విషయాన్ని స్టేట్ డిపార్ట్మెంట్ వార్షిక మదింపు సమయంలో రూపొందించిన నివేదికలో వెల్లడించింది.
అయితే.. ఈ బహుమతులు అధ్యక్షులు కానీ వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా చెందవని అమెరికా అధికారులు తెలిపారు. వాటిలో దాదాపు మొత్తం స్టేట్ డిపార్ట్మెంట్ కు చెందిన ఆర్కివ్స్ కు వెళతాయి. అక్కడ వాటిని భద్రపరుస్తారు. వాటితోనే.. కొన్ని మ్యూజియమ్స్, మరికొన్ని వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. తర్వాత తరాలకు తెలిసేలా, అధ్యక్ష పాలనల్లో అందుకున్న వస్తువులు తెలిసేలా.. ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు.
అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు బైడెన్ ఎన్నో ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాటిలో ఇటీవల అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ యూన్ అందించిన USD 7,100 విలువైన స్మారక ఫోటో ఆల్బమ్, మంగోలియన్ ప్రధాన మంత్రి బహుకరించిన USD 3,495 మంగోలియన్ యోధుల విగ్రహం, USD 3,300 వెండి గిన్నె సహా.. అనేకం ఉన్నాయి. బ్రూనై సుల్తాన్.. USD 3,160 స్టెర్లింగ్ వెండి ట్రే, ఇజ్రాయెల్ అధ్యక్షుడు, ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ నుంచి USD 2,400 విలువైన కోల్లెజ్ ఉన్నాయి.
ఫెడరల్ చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అధికారులు విదేశీ నాయకులు నుంచి అందిన బహుమతులు USD 480 కంటే ఎక్కువగ ఉంటే వాటిని ప్రత్యేకంగా నేషనల్ ఆర్కైవ్స్‌కు బదిలీ చేస్తారు. లేదా.. అధికారిక ప్రదర్శనలలో ఉంచుతారు. కొన్ని సార్లు ఈ బహుమతుల్ని వేలంలో విక్రయిస్తారు కూడా.. కానీ ఇది చాలా అరుదుగా జరుగుతుంటాయని అమెరికా అధికారులు తెలుపుతున్నారు.
Also Read : పక్షులు విమానాన్ని కూల్చేస్తాయా? అదెలా సాధ్యం.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటీ?
అయితే.. అమెరికా నాయకులతో పాటు సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ అధికారులు సైతం అనేక ఖరీదైన బహుమతులు అందుకుంటుంటారు. కానీ.. వాటిని ఎట్టిపరిస్థితుల్లో వినియోగించడం కానీ, అధికారిక నివాసాలు, సీఐఏ కార్యాలయాల్లో ఉంచకూడదని డిపార్ట్‌మెంట్ ఆఫీస్ ఆఫ్ ప్రోటోకాల్ సూచిస్తుంది. వీటిలో పలువురు ఉద్యోగులకు చేతి గడియారాలు, పెర్ఫ్యూమ్, ఆభరణాలు, విలాసవంతమైన బహుమతులు అందుకున్నట్లు నివేదికలో వెల్లడించారు. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా.. వీటిని నాశనం చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. వీటి విలువ USD 1,32,000 కంటే ఎక్కువని తెలిపారు.