PM Modi: ప్రధాని మోదీ సౌదీ నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడు పాక్ గగనతలాన్ని ఎందుకు ఉపయోగించలేదు? నిఘా వర్గాలు ఎలాంటి హెచ్చరిక చేసింది? ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసర సమావేశం ఎందుకు నిర్వహించారు? పహల్‌గామ్ ఉగ్ర దాడి తర్వాత పొరుగుదేశం గగనతలాన్ని ఉపయోగించడం కరెక్టు కాదని భావించారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రూటు మార్చడం వెనుక
మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ సౌదీ పర్యటనకు వెళ్లారు. అక్కడ దిగిన తర్వాత సాయంత్రం సమయంలో జమ్మూకాశ్మీర్‌లో పహల్‌గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ విషయం తెలియగానే వెంటనే జమ్మూకాశ్మీర్ వెళ్లానని హోంమంత్రికి సంకేతాలు ఇచ్చారు. అయితే అక్కడ పరిస్థితి తీవ్రం కావడంతో సౌదీ పర్యటనను కుదించుకుని హుటాహుటీన భారత్‌కు చేరుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ.
మంగళవారం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ఎయిర్‌ఫోర్స్ బోయింగ్ 777-300 విమానం పాకిస్థాన్ గగనతలం మీదుగా రియాద్ చేరుకుంది. అయితే పహల్‌గామ్ దాడి నేపథ్యంలో తిరుగు ప్రయాణానికి పాక్ గగన తలాన్ని ఉపయోగించలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. అరేబియా సముద్రం గుండా గుజరాత్ గగనతలం మీదుగా ఢిల్లీకి చేరుకున్నారు.
ప్రధాని మోదీ ఇలా రూటు మార్చడం వెనుక రకరకాల కారణాలు లేకపోలేదు. పాకిస్థాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రూట్ మార్చినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్లయిట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ALSO READ: పహల్‌గామ్ దాడి చేసింది ఈ మృగాలే.. అందుకే చంపామని ప్రకటన
ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా భేటీ
బుధవారం ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్రమోదీ ఎయిర్‌పోర్టులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తోపాటు మరో ఇద్దరు అధికారులు ఉన్నారు. పహల్‌గామ్ దాడిపై చర్చ, ఆపై భద్రతా చర్యలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. కాకపోతే ఏం జరిగిందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
రీసెంట్‌గా ముంబై ఉగ్రదాడుల కీలక నిందితుడు తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి రప్పించింది భారత్. కొన్ని రోజులుగా ఆయన్ని ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. రాణా కూడా పాకిస్థానీ దేశీయుడే. ఈ నేపథ్యంలో పహల్‌గామ్‌లో ఉగ్రదాడి జరగడం, ప్రధాని మోదీ గగన తలాన్ని ఉపయోగించకుండా ఆరేబియా సముద్రం మీదుగా రావడం వెనుక ఏదో జరుగుతున్న చర్చ అప్పుడే ఢిల్లీ ప్రభుత్వ వర్గాల్లో మొదలైంది.
జమ్మూకాశ్మీర్, పీఓకేలో ఉగ్రవాదులను ఏరి వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. ఢిల్లీలో ప్రధాని మెదీ జాతీయ భద్రతా సలహాదారుడు, రక్షణ మంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. వెంటనే త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. సాయంత్రం మోదీ కేబినెట్ భేటీ కానుంది. సమావేశం తర్వాత పహల్గామ్ ఉగ్ర దాడి, ప్రభుత్వం తీసుకున్న చర్యలను అఖిల పక్షానికి వివరించేందుకు సిద్ధమవుతోంది కేంద్రం.