బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ ఓటర్ లిస్ట్ సవరణ పెద్ద దుమారం రేపింది. ఓటర్ లిస్ట్ విషయంలో తీవ్ర అక్రమాలు జరిగాయని అంటున్నారు. అక్రమాలను సరిదిద్దడానికి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విధానం కూడా లోపభూయిష్టంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. చనిపోయిన వారు పేర్లు కూడా SIR లో నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
అసలేంటి SIR?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగాల్సి ఉంది. ఈ ఏడాది మొదలవగానే బీహార్ లో ఎన్నికల సందడి మొదలైంది. అదే సమయంలో ఓటర్ లిస్ట్ లో తప్పులున్నాయని, వాటిని సవరించాలనే వాదన మొదలైంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ని చేపట్టింది. బీహార్ లో దాదాపు 7.90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7.23 కోట్ల మంది ఓటర్ల పత్రాలను ఎన్నికల కమిషన్ డిజిటలైజ్ చేసింది. 35 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఎన్నికల కమిషన్ తమ నివేదికలో పేర్కొంది. దాదాపు 22 లక్షల మంది ఓటర్లు మృతి చెందారని పేర్కొంటూ వారి ఓటు హక్కు తొలగించింది. 7 లక్షల మందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండటంతో వారి విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామంది. ఇంకా 1.2 లక్షల మంది SIR కి సంబంధించి పత్రాలు ఇవ్వలేదని ఈసీ పేర్కొంది. ఆగస్టు 1 నాటికి మిగతా ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేయాల్సి ఉంది.
SIR ద్వారా అంతా సజావుగానే ఉందని చెప్పే ప్రయత్నం చేసింది ఎన్నికల కమిషన్. అవకతవకలు జరగడానికి అవకాశం లేకుండా ఓటరు జాబితా రూపొందించామంటోంది. కానీ బీహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ మాత్రం ఈ వాదనను తప్పుబడుతోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ కూడా ఈసీ చర్యల వల్ల ఎలాంటి ఉపయోగం లేదంది. చనిపోయిన వారు కూడా SIR కోసం పత్రాలు సమర్పించినట్టు ఈసీ గణాంకాలు చెబుతున్నాయని వారు విమర్శించారు. అసలు కొంతమంది వద్ద ఎలాంటి పత్రాలు సేకరించకుండానే ఈసీ లెక్కలు ముగించేశారని అంటున్నారు. దీనివల్ల అర్హులైన చాలా మంది ఓటు హక్కు కోల్పోతారని, చనిపోయిన వారికి మాత్రం ఓటు హక్కు అలానే ఉంటుందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు సదరు సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. బూత్ లెవల్ ఆఫీసర్లు(BLO) విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించారని, చాలామంది ఓటర్లు BLOలను కలవకపోయినా, వారి పత్రాలు SIR కోసం నమోదు చేశారని చెప్పారు. SIR అంతా లోపభూయిష్టంగా ఉందని వారు సుప్రీంకోర్టుకి తెలిపారు.
సుప్రీంకోర్టు ఆందోళన..
వాస్తవానికి అసలు SIR వద్దంటూ ప్రతిపక్షాలు ఇదివరకే సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. అయితే సుప్రీం SIR ని నిర్వహించాల్సిందేని తేల్చి చెప్పింది. ఓటు హక్కు కొనసాగించేందుకు ధృవీకరణకోసం ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఇక SIR జరిగిన తర్వాత కూడా ప్రతిపక్షాలు ఈసీకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కాయి. దీనిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో బీహార్ ఎన్నికల వేళ ఓటరు జాబితా మరిన్ని గందరగోళాలకు తావిస్తున్నట్టయింది.