PM Narendra Modi: ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బడ్జెట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ఇది ప్రజల బడ్జెట్ అని.. వారి ఆకాంక్షలను ప్రతిబింభిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఇది దేశంలోని 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని అన్నారు. దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని చెప్పారు. దేశాభివృద్ధి ప్రయాణంలో.. ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే బడ్జెట్ ఇది అని కొనియాడారు. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నామని.. బడ్జెట్‌లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ.. ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించిందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
ఈ బడ్జెట్ పొదుపు, పెట్టుబడులకు బూస్త్ ఇస్తోందని చెప్పుకొచ్చారు. తయారీ రంగానికి ఎతో ప్రాధాన్యత ఇచ్చాం. ఇది నూటికి నూరు శాతం ప్రజల బడ్జెట్.
దేశాభివృద్ధికి ఊతం ఇస్తుంది. గత ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటే.. మేము వారికి డబ్బులిస్తున్నాం. ఉద్యోగులకు, మధ్య తరగతి కుటుంబాలకు ఈ బడ్జెట్ ఎంతో తోడ్పడుతుంది. ఆత్మనిర్భర్‌ను భారత్ మరింత బలోపేతం చేస్తోంది’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్‌ను నూతన శతాబ్దానికి మార్గదర్శకంగా ప్రధాని అభివర్ణించారు. దేశీయ ఉత్పత్తులను పెంచేందుకు అనేక ప్రోత్సాహకాలను అందజేశాం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
అయితే.. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ నిర్మలా సీతారామన్ కూర్చున్న ప్లేస్‌కి వెళ్లి కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. నిర్మలా సీతా రామన్‌ను ఉద్దేశిస్తూ.. ‘అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మీరు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలా బాగుంది’ అని ప్రధాని మోదీ ఆమెతో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు.. బడ్జెట్ ప్రసంగంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడంలో దోహదపడుతుందని అమిత్ షా ట్వీట్ చేశారు.