Wayanad Priyanka Gandhi| కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ సత్తా చాటారు. ఈ స్థానం నుంచి ఆమె గెలుపు ముందే లాంఛనమైనా.. ఎంత మెజార్టీ సాధిస్తుందనే విషయమై అనేక ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అత్యధికంగా.. 4 లక్షలకు పైగా మెజార్టీతో కేరళా కాంగ్రెస్ నాయకులతో పాటు, దేశవ్యాప్తంగానూ ఆశ్చర్యపరిచారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. 3 లక్షల 64 వేల 422 ఓట్ల మెజార్టీని సాధించగా, ఇప్పడు ప్రియాంక గాంధీ ఆ రికార్డును బ్రేక్ చేశారు. అన్న రాహుల్ మెజార్టీని దాటి 4 లక్షల 3 వేల 966 ఓట్లను సాధించి ఎన్నికల్లో నాయనమ్మ ఇందిరా గాంధీ వారసత్వాన్ని కొనసాగించారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తారంటీ ప్రచారం జరిగింది. కానీ వాస్తవంలో మాత్రం ఆమె మూడో స్థానానికి పడిపోయింది.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 48 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఉపఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఈ రోజు జరుగుతోంది. ఇందులో రెండు పార్లమెంట్ స్థానాలు.. వయనాడ్, నాందేడ్ లలో ఉపఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల బరిలో తొలిసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ జెనెరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రంగంలో దిగారు.
వయనాడ్ లో ప్రియంక గాంధీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) సీనియర్ నాయకుడు సత్యన్ మోకెరి, భారతీయ జనతా పార్టీ (బిజెపీ) తరపున నవ్య హరిదాస్ ఎంపీ స్థానం కోసం పోటీ చేస్తున్నారు. మొత్తం 64.72 శాతం పోలింగ్ నమోదైంది. అంతకుముందు లోక్ సభ జెనెరల్ ఎలెక్షన్స్ లో 72.92 శాతం పోలింగ్ నమోదం కావడం గమనార్హం.
ఇంతకుముందు వయానడ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజయం సాధించారు. కానీ ఆయన అప్పుడు అమేఠీ నుంచి కూడా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో వయనాడ్ స్థానం నుంచి ఎంపీగా ఉపసంహరించకున్నారు. ఉపఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వయనాడ్ లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడం జరిగాయి. ఈ ప్రకృత్తి ప్రకోపాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించకపోవడాన్ని ఆమె తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు.
Also Read: ఇండియాకు పంపవద్దు.. అమెరికా సుప్రీం కోర్టుకు చేరిన ముంబై పేలుళ్ల కుట్రదారుడు
దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల ఉపఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో బిజేపీ, కాంగ్రెస్-సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి) కూటమి మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. ఎస్‌పి-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం 9 సీట్లపై బిజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఉత్తర్ ప్రదేశ్ లో అంబేద్కర్ నగర్ లోని కటెహరి నియోజకవర్గం, మైన్ పురిలోని కర్హల్, ముజఫర్‌నగర్ లోని మీరాపూర్, గాజియాబాద్, మిర్జాపూర్ లోని మఝావాన్, కాప్పూర్ లోని సిసామావు, అలీగడ్ లోని ఖైర్, ప్రయాగ్ రాజ్ పరిధిలోని ఫూల్‌పూర్, మొరదాబాద్ లోని కుందర్కీ నియోజకవర్గాల్లో నవంబర్ 20న ఉపఎన్నికలు జరిగాయి.
రాజస్థాన్ రాష్ట్రాలో మొత్తం 7 సీట్లు – ఝున్‌ఝును, దౌసా, దియోలీ-ఉనైరా, ఖిన్వసార్, చౌరాసి, సాలుమ్‌బూర్, రాంగడ్ లో నవంబర్ 13న ఉపఎన్నికలు జరిగాయి. అలాగే అస్సాంలోని అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలలో నవంబర్ 13న ఉపఎన్నికలు జరిగాయి. సిక్కింలో సోరెంగ్ చాక్‌హుంగ్, నాంచీ సింగిథాంగ్ అసెంబ్లీ సీట్లపై బైపోల్స్ నిర్వహించారు. మధ్యప్రదేశ్ లోని బుధ్నీ, విజయ్‌పూర్ సీట్లపై ఎన్నికల కమిషన్ ఉపఎన్నికలు నిర్వహించింది.