అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం కంటే.. పూరీలోని జగన్నాథుడి దర్శనమే తనకు ముఖ్యం అని అన్నారు భారత ప్రధాని మోదీ. ఇటీవల ట్రంప్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. అప్పటికే ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. అట్నుంచి అటు మోదీని వాషింగ్టన్ వచ్చి వెళ్లాలని ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఆయన తాను రావడం కుదరదని ట్రంప్ కి చెప్పేశారు. నేరుగా ఇండియాకు వచ్చారు. బీహార్ పర్యటన ముగించుకుని అనంతరం ఒడిశాకు వచ్చారు. ఒడిశాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యం కంటే తనకు పూరీ జగన్నాథుడి దర్శనమే ముఖ్యం అన్నారు.
ట్రంప్ ఆహ్వానం దేనికంటే..?
ఆమధ్య ప్రధాని మోదీ జీ-7 సదస్సుకోసం కెనడా వెళ్లారు. ఆ పర్యటనకు ట్రంప్ కూడా వచ్చారు. అయితే అనూహ్యంగా ఆయన వెనుదిరిగారు. వాషింగ్టన్ కు వెళ్లిన అనంతరం విందుకు రావాలంటూ మోదీని ఆహ్వానించారు ట్రంప్. అదే సమయంలో ఆయన పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని కూడా విందుకు ఆహ్వానించారు. అప్పటి వరకు భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్.. భారత ప్రధాని మోదీని, పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ ని ఒకే వేదికపైకి తీసుకు రావాలనుకున్నారు. తద్వారా తాను మరింత మేధావిని అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. కానీ మోదీ, ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లారు. తనకు రావడం కుదరదన్నారు. భారత్ కు వచ్చాక తన పర్యటనల్లో బిజీ అయిపోయారు మోదీ. అయితే ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించడానికి గల కారణాన్ని ఇప్పుడు బయటపెట్టారు.
105 ప్రాజెక్ట్ లు ప్రారంభం..
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధిస్తామని చెప్పారు మోదీ. ఒడిశాలో రూ.18,600 కోట్ల విలువైన 105 ప్రాజెక్టులను తాజాగా ఆయన ప్రారంభించారు. సుపరిపాలన, ప్రజాసేవలో ఒడిశా ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు మోదీ. ఈ సందర్భంలోనే ఆయన ట్రంప్ ఆహ్వానాన్ని ప్రస్తావించారు. జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ తనకు ఫోన్ చేశారని, వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారని, విందులో పాల్గొని కొన్ని అంశాలపై చర్చిద్దామని చెప్పారని అన్నారు. అప్పటికే తన ఒడిశా యాత్ర ఖాయమైందని, జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లడం తనకు ముఖ్యమని, అందుకే ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించానని అన్నారు మోదీ. ఒకవేళ మోదీ అమెరికాకు వెళ్లి ఉంటే, ప్రతిపక్షాలనుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యేవి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడితో వేదిక పంచుకోవడం భారత్ కు తలవొంపులుగా మారేది. అందుకే ఆయన ఆ పర్యటనను వద్దనుకున్నారు. ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారు.
ఒడిశా పర్యటన అనంతరం మోదీ ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో జరగబోతున్న యోగా దినోత్సవంలో ఆయన పాల్గొంటారు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ పర్యటనకోసం వచ్చే సందర్భంలో ఆయన ఒడిశా టూర్ కూడా పెట్టుకుంటున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం, ఏపీలో బీజేపీ కూటమిలోని ప్రభుత్వం ఉండటం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాల పర్యటనలకు మోదీ ఆసక్తి చూపిస్తుండటం విశేషం.