Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు సంబంధించి అధికార బీజేపీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సహా ఇతర కీలక అంశాల్లో మిగతా ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పట్టించుకోవడం లేదని వస్తున్న కథనాలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని.. తద్వారా పార్లమెంటులో చేసే చట్టాలన్నీ అక్రమంగా మారుతున్నాయని ఆరోపించారు.
మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యం నాశనం అవుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘సీఈసీ జ్ఞానేష్ కుమార్ చేసిన పని భారత దేశానికి వ్యతిరేకమైనది. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి. జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలి. అదే ఆయన చాటుకునే నిజమైన దేశభక్తి అవుతుంది. ఈ విధ్వంసానికి బాధ్యులైన వారు ఈరోజు కాకపోతే రేపు.. రేపు కాకపోతే ఎల్లుండైనా శిక్ష అనుభవించక తప్పదు’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
రాబోయే 30 ఏళ్లపాటు బీజేపీయే అధికారంలో ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడూ ప్రభుత్వ వ్యతిరేకతను కాదని ఇంత నమ్మకంగా మాట్లాడలేరని అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం కాంగ్రెస్ చాలా కాలంగా ఆలోచించిందని, చివరికి దానికి ‘ఓట్ల చోరీ’ (Vote Chori) రూపంలో సమాధానం దొరికిందని రాహుల్ పేర్కొన్నారు. ‘ఓటు నాశనమైతే రాజ్యాంగం నాశనమైనట్లే. ఓట్ల చోరీ నుంచి చట్టాల చోరీ.. దాని నుంచి వ్యవస్థల చోరీ జరుగుతోంది’ అని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం అక్రమాలు (రిగ్గింగ్) జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్‌పై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలను తాను అడిగిన ప్రశ్నలను పూర్తిగా తొక్కిపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం పార్లమెంటులో కూర్చున్న ఎంపీలు దొంగిలించబడిన ఓట్లతో గెలిచారని వారు చేసే చట్టాలకు చట్టబద్ధత లేదని అన్నారు.
Also Read: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ సీన్‌తో సెటైర్లు!
మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై బీజేపీ అంతే ఘాటుగా స్పందించింది. రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం ఒక నీరుగారిన ఉత్సవంలా ఉందని ఎద్దేవా చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల మద్దతు గెలవలేకపోయామన్న నిరాశలో ఉన్న నాయకుడు రాహుల్ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. భారత ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ-వాద్రా కుటుంబాన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాలను తట్టుకోలేకనే ఈ రకమైన ఆరోపణనలకు రాహుల్ ఉక్రమించారని మండిపడ్డారు.
Also Read: తల్లి, భార్య, కూతురు కోసం.. అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్‌లు.. జీరో రిస్క్, గ్యారెంటీ లాభం!