Rahul Gandhi Hathras Rape| లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రస్ నగరానికి వెళ్లారు. 2020 సంవత్సరం సెప్టెంబర్ లో హాత్రస్ నగరానికి చెందిన ఓ 19 ఏళ్ల దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురై.. ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రాహుత్ గాంధీ ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి హాత్రస్ వెళ్లారు.
చనిపోయిన తరువాత బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు దొంగచాటుగా అంతక్రియలు చేశారు. ఈ విషయం చాలా ఆలస్యంగా ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో హాత్రస్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ హాత్రస్ వెళ్లాలని ప్రయత్నించినా కేంద్ర ప్రభుత్వం అక్కడ శాంతి భద్రతల సమస్యను చూపి ఆయనను హాత్రస్ బాధితురాలి కుటుంబంతో కలవకుండా నిరోధించింది. కానీ రాహుల్ గాంధీ వారిని కలిసేందుకు వస్తానని ఆ సమయంలో మాటిచ్చారు.
అలా ఇప్పుడు నాలుగేళ్ల తరువాత హాత్రస్ వెళ్లి గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. వారి ఇంట్లో గంట పాటు కూర్చొని వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. హాత్రస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగుప్త విక్రమాదిత్య ఈ విషయాలను మీడియాకు తెలిపారు. “హాత్రస్ లో ఆ కుటుంబానికి ప్రాణ హాని ఉండడంతో వారు చాలా కష్టాలు పడుతున్నారు. వారు మార్కెట్ వెళ్లాలన్నా పోలీసుల భద్రతతో వెళ్లాలి. ఈ కుటుంబం పిల్లలు స్కూల్‌కు వెళ్లి చదువుకోలేకపోతున్నారు. వారు తమ ఇంట్లోనే బందీలుగా ఉండిపోయారు. ఇక్కడ యోగి- మోడీ ప్రభుత్వం వారి కోసం హామీలు ఇచ్చింది. కానీ అవి పూర్తి కాలేదు. వారి ఈ కష్టాలన్నీ రాహుల్ గాంధీ విన్నారు. ఆ కష్టాలను తీరుస్తానని మాటిచ్చారు. ” అని చంద్రగుప్త విక్రమాదిత్య చెప్పారు.
Also Read: భార్యకు భరణం ఎంత ఇవ్వాలో లెక్కలు చెప్పిన సుప్రీం కోర్టు..
మరోవైపు కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ చర్యలను తప్పుబట్టింది. ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “రాహుల్ గాంధీకి హాత్రస్ కేసు తీవ్రత గురించి తెలియదని.. ఇదంతా ఆయన పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని చెప్పారు. హాత్రస్ గ్యాంగ్ రేప్ కేసు సిబిఐ అధికారులు విచారణ పూర్తి చేశారు. కేసు కోర్టులో ఉంది. అయినా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి ఏం సాధిస్తారు. ఆయన మళ్లీ ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారా? అయినా ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఆయన చెప్పేది నమ్మడం లేదు.” అని అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్ భర్, బిజేపీ జాతీయ జెనెరల్ సెక్రటరీ తరుణ్ చుగ్ రాహుల్ గాంధీ హాత్రస్ కు వెళ్లడం కేవలం పబ్లిసిటీ కోసమేని చెప్పారు.
హాత్రస్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు అప్పటి బిజేపీ నాయకుడు కుల్దీప్ సెంగార్ కోర్టులో దోషిగా నిరూపితమై జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవలే అతను ఆరోగ్య కారణాల రీత్యా జైలు నుంచి పెరోల్ పై బయటికి వచ్చాడు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ హాత్రస్ వెళ్లడం గమనార్హం.