Instagram AI Age Detection: సోషల్ మీడియా వాడాలనే ఆసక్తితో చాలామంది టీనేజర్లు తమ అసలు వయసు దాచి, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు పెద్దవాళ్ల పుట్టిన తేదీని ఎంటర్ చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటి ట్రిక్స్ అస్సలు పనిచేయవు. ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్న 18 ఏళ్ల లోపు పిల్లలను గుర్తించేందుకు మెటా సంస్థ తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. నవంబర్ 9న ప్రకటించిన ఈ నిర్ణయంతో.. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు వయసు ఇచ్చినా సరే, ఏఐ ఇట్టే పసిగట్టి వారి అకౌంట్లను ‘టీన్ అకౌంట్’ (Teen Account) పరిధిలోకి తీసుకొస్తుంది.
ఏఐ ద్వారా టీనేజర్లుగా గుర్తించబడిన యూజర్ల అకౌంట్లకు ఆటోమేటిక్‌గా కొన్ని సేఫ్టీ లాక్స్ పడతాయి. ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులు వీరికి మెసేజ్ చేయడం కుదరదు. అంతేకాకుండా.. వారి వయసుకు తగని కంటెంట్ కనిపించకుండా ఫిల్టర్ అవుతుంది, స్క్రీన్ టైమ్‌పై కూడా కఠినమైన నియంత్రణలు ఉంటాయి. ఫేస్‌బుక్, మెసెంజర్‌లలో కూడా ఇదే తరహా రక్షణ కవచాలు అందుబాటులో ఉన్నాయి.
కేవలం ఏఐ మాత్రమే కాకుండా.. మెటా మరిన్ని అదనపు మార్గాలను కూడా వాడుతోంది. ఉదా: ఆస్ట్రేలియాలో యాపిల్ సంస్థ అందించే ఏజ్ రేంజ్ సిగ్నల్ ఆధారంగా యూజర్ల వయసును అంచనా వేస్తోంది. అమెరికాలో అయితే, పిల్లల వయసు వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో చూసుకోవాలని, టీన్ అకౌంట్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో వివరిస్తూ తల్లిదండ్రులకు నేరుగా నోటిఫికేషన్లు పంపనుంది.
Also Read: వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!
ఈ కొత్త టెక్నాలజీని కేవలం ఇన్‌స్టాగ్రామ్‌కే పరిమితం చేయకుండా, ఫేస్‌బుక్‌లోనూ మెటా వేగంగా అమలు చేస్తోంది. త్వరలోనే థ్రెడ్స్ (Threads) ప్లాట్‌ఫామ్‌లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏజ్ డిటెక్షన్ టెక్నాలజీని తీసుకురావడానికి మెటా సిద్ధమవుతోంది. తద్వారా తమ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో చిన్నపిల్లల భద్రతను కట్టుదిట్టం చేయాలని భావిస్తోంది.
సోషల్ మీడియా వల్ల టీనేజర్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందంటూ మెటాపై భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఆగస్టులో అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలతో కలిసి సుమారు రూ.1.68 లక్షల కోట్ల (18 బిలియన్ డాలర్లు) భారీ సెటిల్‌మెంట్‌కు మెటా ఒప్పుకుంది. అలాగే గత నెలలో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన మరో కేసులోనూ రాజీ కుదుర్చుకుంది. ఈ చట్టపరమైన చిక్కుల నుండి బయటపడటానికే, ఇకపై నిబంధనలను ఎవరూ తప్పించుకోకుండా ఏఐ సాయంతో మెటా ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది.
Also Read: కెమెరా మార్కెట్‌లోకి వివో ఎంట్రీ? ట్రేడ్‌మార్క్‌తో బయటపడిన ఆసక్తికర విషయం!