Meta Late CM Siddaramaiah| కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చనిపోయారని సోషల్ మీడియా దిగ్గజం మెటా కంపెనీకి చెందిన ప్లాట్ ఫామ్స్ లలో ఒక పోస్ట్ కనిపించింది. అది చూసి అందరూ గందరగోళానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన సిఎం సిద్దరామయ్య.. కంపెనీ తీరుపై మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కంపెనీ సేవలు మూసివేతకు గురవుతాయని హెచ్చరించారు.
అయితే జరిగిన తప్పిదం తెలుసుకున్న మెటా వెంటనే క్షమాపణలు తెలిపింది. గురువారం తమ ప్లాట్‌ఫామ్‌లలో జరిగిన ఒక తీవ్రమైన ఆటో-ట్రాన్స్‌లేషన్ లోపం కారణంగా క్షమాపణ వ్యక్తం చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య షేర్ చేసిన ఒక సంతాప సందేశాన్ని తప్పుగా అనువదించడం వల్ల, ఆయన మరణించినట్లు తప్పుడు ప్రచారం జరిగింది. ఈ లోపం మెటా కంపెనీకి చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో జరిగింది. దీనిపై సిద్ధరామయ్య బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు అనువాదం వాస్తవాలను వక్రీకరిస్తుందని, ముఖ్యంగా అధికారిక సమాచారం విషయంలో ఇది ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆయన అన్నారు.
మెటా సంస్థ వెంటనే స్పందిస్తూ.. ఈ లోపాన్ని సరిచేస్తున్నట్లు తెలిపింది. “ఈ అనువాద లోపం కొద్ది సమయం కోసం జరిగింది, దానిని మేము సరిచేశాము. ఇలాంటి లోపం జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నాము,” అని మెటా ప్రతినిధి PTIకి తెలిపారు. సిద్ధరామయ్య ఒక వ్యక్తి మరణం గురించి కన్నడ భాషలో సంతాప సందేశాన్ని పోస్ట్ చేసినప్పుడు ఈ లోపం బయటపడింది. అయితే, అనువాద సాధనంలో లోపం వల్ల.. ఆ సందేశం ఇంగ్లీష్‌లో సిద్ధరామయ్య స్వయంగా మరణించినట్లు అనువదించబడింది. ఈ తప్పుడు అనువాదం అనేక మంది వినియోగదారులను ఆశ్చర్యపరిచి, గందరగోళానికి గురిచేసింది.
సీనియర్ సినిమా నటి బి. సరోజాదేవి మరణంపై సంతాపం తెలియజేస్తూ.. సిద్ధరామయ్య కన్నడలో ఓ పోస్ట్ చేశారు. కానీ, మెటా ఇంగ్లీష్ ఆటో-ట్రాన్స్‌లేషన్ లో ఇలా వచ్చింది. “ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న మరణించారు, బహుభాషా తార, సీనియర్ నటి బి. సరోజాదేవి భౌతిక శరీరాన్ని దర్శించి, చివరి నివాళులు అర్పించారు.” ఈ తప్పిదంపై తీవ్రంగా స్పందిస్తూ.. సిద్ధరామయ్య Xలో పోస్ట్ చేశారు.
“మెటా ప్లాట్‌ఫామ్‌లలో కన్నడ కంటెంట్, తప్పుడు ఆటో-ట్రాన్స్‌లేషన్ వాస్తవాలను వక్రీకరిస్తోంది. యూజర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది అధికారిక సమాచారం విషయంలో ప్రమాదకరం. కర్ణాటక మీడియా సలహాదారు మెటాకు లేఖ రాసి, వెంటనే సరిచేయాలని సూచించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అనువాదాలు తరచూ తప్పుగా ఉంటాయని పౌరులు జాగ్రత్తగా ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను.”
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) మెటాకు ఒక ఈమెయిల్ పంపి, తక్షణ జోక్యం కోరింది. కన్నడ ఆటో-ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని, ఈ ఫీచర్‌ను మెరుగుపరచే వరకు అనువాద సేవలను ఆపాలని CMO కోరింది. అలాగే, కన్నడ భాషా నిపుణులు, ప్రొఫెషనల్స్‌తో కలిసి పనిచేయాలని, కన్నడ నుంచి ఇంగ్లీష్‌కు అనువాదాల సందర్భ కచ్చితత్వాన్ని మెరుగుపరచాలని మెటాను కోరింది. “కన్నడ నుంచి ఇంగ్లీష్‌కు ఆటో-ట్రాన్స్‌లేషన్ తరచూ తప్పుగా ఉంటోందని, కొన్ని సందర్భాల్లో ఘోరమైన తప్పులతో యూజర్లకు తప్పుడు సమాచారం అందిస్తున్నట్లు మేము గమనించాము,” అని సిద్ధరామయ్య మీడియా సలహాదారు కె.వి. ప్రభాకర్ రాశారు.
Also Read: నగరంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య.. యధేచ్ఛగా బైకులు నడుపుతున్న పిల్లలు
ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి, తక్షణ సరిదిద్దు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మెటాను ఒత్తిడి చేసింది. మెటా తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమాధానం ఇవ్వాలని కూడా CMO కోరింది.