Sonia Gandhi President Murmu| పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) శుక్రవారం ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అన్నీ తప్పుడు హామీలే ఇచ్చారు. పైగా, రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగం చివరిలో బాగా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకోపోయారు. పూర్ థింగ్.” అని కామెంట్స్ చేశారు (Parliament Budget Session).
అయితే, సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలపై బిజేపీ తీవ్రంగా ప్రతిఘటించింది. బిజేపీ ఎంపీ సుకంతా మజుందార్.. “ఇవి అసభ్య వ్యాఖ్యలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నేతలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ముఖ్యంగా రాష్ట్రపతిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి జమీందారీ మనస్తత్వం ఉంది, అందువల్ల వారు ఈ విషయాన్ని అంగీకరించలేకపోతున్నారు. అందుకే వారు రాష్ట్రపతి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తున్నారు” అని విమర్శించారు.
పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తమ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, సాధించిన విజయాలను ప్రస్తావించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వాలతో పోలిస్తే మూడు రెట్లు వేగంగా పనిచేస్తోందని, భారతదేశం త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు. ప్రసంగం ప్రారంభంలో.. ప్రయాగ్రాజ్ లోని మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు శ్రద్ధాంజలి అర్పించారు (Parliament Budget Session).
ఎన్డీయే ప్రభుత్వం మూడు రెట్లు వేగంగా పని చేస్తోందని, పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలు అమలు చేసి 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసిందని ప్రెసిడెంట్ ముర్ము అన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తోందని.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల కుటుంబాలకు ఇళ్లను అందిస్తోందని తెలిపారు. నూతన విద్యా విధానం ద్వారా ఆధునిక విద్యను అభివృద్ధి చేస్తోందన్నారు. ఒకే దేశం-ఒకే ఎన్నిక, వక్ఫ్ సవరణ బిల్లు వంటి సంస్కరణలను అమలుకు కృషి చేస్తోందని.. భారత ఏఐ మిషన్, గగన్‌యాన్ వంటి టెక్నాలజీ రంగ ప్రగతితో భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోందని కొనయాడారు.
Also Read: బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం.. పోలవరం కోసం రూ.12వేల కోట్లు కేటాయింపు
రాష్ట్రపతి భవన్ తీవ్ర ప్రతిస్పందన
రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసింది.
ఆ లేఖలో, “సోనియా గాంధీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావు. ఉన్నత పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తన మాటల్లో రాష్ట్రపతి అలసిపోయారని, చాలా కష్టంగా మాట్లాడారని అన్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని అనుకున్నాం. రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదు మరియు ఎప్పటికీ అలసిపోరు. బడ్జెట్ ప్రసంగంలో నిజానికి, అట్టడుగు వర్గాల కోసం, మహిళలు మరియు రైతుల గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆమె ప్రసంగాన్ని నాయకులు (సోనియా గాంధీని ఉద్దేశిస్తూ) హిందీ వంటి భారతీయ భాషలలోని యాస, ఉపన్యాసాలపై పరిచయం లేని కారణంగా రాష్ట్రపతి ప్రసంగంపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చని రాష్ట్రపతి కార్యాలయం విశ్వసిస్తోంది. సోనియా గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం మరియు ఖండించదగినవి” అని పేర్కొంది.