Kerala Rain Alert: అనుకున్న సమయానికి కంటే ముందుగానే కేరళను రుతుపవనాలు పలకరించాయి. రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో కొద్ది రోజుల్లోనే దేశమంతా విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం ఈ నెల 27న కేరళకు రుతుపవనాలు వస్తాయన్న భిన్నంగా మూడు రోజుల ముందే కేరళను తాకాయి. గతంలో 2009లో మే 23వ తేదీనే దేశంలోకి నైరుతి ప్రవేశించగా.. ఆ తర్వాత ఈ సారి మే 24న కేరళను తాకాయి.
దక్షిణ కొంకణ్‌కు ఆనుకుని తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. తూర్పుదిశగా పయనించి వచ్చే 24 గంటల్లో మధ్య మహారాష్ట్ర మీదుగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. మరింత బలహీనపడి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఈ నెల 27వ తేదీలోగా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సారి వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో అందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రానున్న రెండురోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలో పూర్తి భూభాగం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది.
అలాగే ఏపీకి రానున్న మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు సూచించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచనున్నట్లు తెలిపింది. దీంతో ఏపీలోని పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది. ఇవాళ కర్నూలు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు.. నంద్యాల, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా తెలంగాణలో కూడా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వేటకు వెళ్లే మత్స్య కారులు బయటికి వెళ్లకూడదని.. వెలితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Also Read: నిద్రపోతున్న పేదవాడిపై నాలా పూడిక వేసిన పారిశుధ్య కార్మికులు.. స్పాట్ డెడ్
అయితే కొంతమందికి ఈ వర్షాలు రావడం గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పంటలు ఎవరైతే వేసుకుంటారో.. వారికి ఇది చల్లని కబురు అని చెబుతున్నారు. కానీ అందరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. చిన్న పిల్లలు, వృద్ధులు అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.