Student Pass Without Exam| ఒక విద్యార్థిని పరీక్ష రాయకుండానే పాస్ అయిపోయింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పదో తరగతి పరీక్ష. ఈ విచిత్ర సంఘటన జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో జరిగింది. విద్యాశాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరగిందని తెలియడంతో ఇప్పుడు విమర్శలు వెలువెత్తాయి.
వివరాల్లోకి వెళితే.. నందిని కుమారి అనే విద్యార్థిని 10వ తరగతి బోర్డు పరీక్షలో 46 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కానీ, ఆమె తండ్రి సంజయ్ మండల్ మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే, నందిని ఈ ఏడాది పరీక్ష రాయనే లేదు! జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ (JAC) ఆమెను వయస్సు తక్కువగా ఉందని పరీక్షకు అనుమతించలేదు. అయినప్పటికీ, ఆమె పదో తరగతి పాస్ అయినట్లు ఫలితం ప్రకటించబడింది. దీంతో విద్యాశాఖపై తీవ్రమైన నిర్లక్ష్యం ఆరోపణలు వచ్చాయి.
నందిని కుమారి సాహిబ్‌గంజ్ జిల్లాలోని దిగ్ఘి నయా టోలా గ్రామానికి చెందినది. ఆమె పట్నా బ్లాక్‌లోని అప్‌గ్రేడెడ్ హైస్కూల్ దిగ్ఘిలో చదువుతోంది. ఇటీవల వెలువడిన టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆమె పేరు ఉంది. అంతేకాదు ఆమె పేరుతో అడ్మెట్ కార్డు కూడా వచ్చేసింది. ఆమె తల్లిదండ్రుల పేర్లు కూడా సంజయ్ మండల్, రీతా దేవి అని సరిగ్గా ఉన్నాయి. ఇది ఆమె కుటుంబాన్ని మరింత గందరగోళంలోకి నెట్టింది. అసలు ఏం జరిగిందని వారు ఆలోచిస్తున్నారు.
ఈ గందరగోళానికి కారణం ఏంటో విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. అదే స్కూలులో మరో నందిని కుమారి ఉంది. ఆమె తల్లిదండ్రులు హరి ప్రసాద్ రవిదాస్, జిత్ని దేవి. ఈ రెండో నందిని బర్హద్వా బ్లాక్‌లోని అధతికర్ గ్రామానికి చెందినది. ఈ ఏడాది ఆమె 10వ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది. కానీ, స్కూలు అధికారుల నిర్లక్ష్యం వల్ల బోర్డు అధికారులు ఈ ఇద్దరి వివరాలను తప్పుగా నమోదు చేశారు. మొదటి నందిని వివరాలు రెండో నందిని పరీక్షా పత్రాల్లో చేరాయి.
రెండో నందిని కుమారి మాట్లాడుతూ.. తన అడ్మిట్ కార్డులో తల్లి పేరు రీతా దేవి, తండ్రి పేరు సంజయ్ మండల్ అని ఉందని, కానీ తాను దాన్ని పట్టించుకోకుండా పరీక్ష రాశానని చెప్పింది. ఆమె ఆదివారం తాను పరీక్షలో ఉత్తీర్ణత సాధించానని, కానీ ఇంకా మార్కుల జాబితా రాలేదని తెలిపింది.
సాహిబ్‌గంజ్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) డాక్టర్ దుర్గానంద్ ఝా.. ఈ తప్పిదాన్ని ఒప్పుకున్నారు. “స్కూలులో ఇద్దరు నందిని విద్యార్థులు ఉన్నారు. ఒకరిని వయస్సు తక్కువగా ఉందని పరీక్ష రాయనివ్వలేదు. కానీ, మొదటి నందిని రిజిస్ట్రేషన్ నంబర్, తల్లిదండ్రుల పేర్లు రెండో నందిని పరీక్షా పత్రాల్లో నమోదయ్యాయి. ఇది విద్యాశాఖ వల్ల జరిగిన పెద్ద తప్పిదం. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అలాగే, పరీక్ష రాసిన నందిని సర్టిఫికేట్‌ను సవరిస్తాం,” అని ఆయన అన్నారు.
Also Read: మహిళా ఉద్యోగి ఇంట్లో ఎవరూలేనప్పుడు దొంగ చాటుగా ప్రవేశించిన బాస్.. ఆమె రాగానే అండర్‌వేర్‌లో..
ఈ సంఘటన విద్యాశాఖలోని నిర్లక్ష్యాన్ని, విద్యార్థుల వివరాల నమోదులో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని బయటపెట్టింది. ఇప్పుడు అధికారులు ఈ తప్పును సరిదిద్దే పనిలో ఉన్నారు. రెండో నందిని కుమారి తన మార్కుల జాబితాను సరైన వివరాలను అందజేయాలని అధికారులను కోరింది.