దేశంలోని పలు మార్కెట్లలో చక్కెర ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పండుగల సీజన్ ప్రారంభానికి ముందే ధరలు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు భారీగా చక్కెర ఎగుమతి చేసిన భారత్ ఇప్పుడు దిగుమతులపై కూడా ఆలోచిస్తోంది. చెరకు ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఇథనాల్ తయారీకి మళ్లించడమే ప్రధాన కారణాల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ మార్కెట్లో ఆగస్టు ప్రారంభం నుంచి చక్కెర ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి. 100 కిలోల చక్కెర ధర రూ.5,350కు చేరింది. ఆగస్టు 18న దేశవ్యాప్తంగా సగటు రిటైల్ ధర కిలోకు రూ.52.30గా నమోదైంది. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కిలో చక్కెర ధర దాదాపు రూ.65కు చేరింది. హైదరాబాద్, ముంబై, భోపాల్ వంటి నగరాల్లో కూడా ధరలు రూ.58 నుంచి రూ.63 వరకు ఉన్నాయి. గణేశ్ చతుర్థి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ పెరగడంతో చక్కెరకు డిమాండ్ పెరుగుతుంది.
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే E20 లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ద్వారా ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఇథనాల్ కోసం చెరకు ఉపయోగించడం వల్ల చక్కెర తయారీ కోసం చెరకు లభ్యత తగ్గిపోయింది. భారత్‌లో ఇథనాల్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల్లో చెరకు వాటా 30 నుంచి 35 శాతం ఉంటుంది. మిగిలిన వాటిలో మొక్కజొన్న, బియ్యం వంటి పంటలు ఉన్నాయి. 2025 నాటికి దేశంలో 499 కేంద్రాల్లో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఈ కేంద్రాల మొత్తం వార్షిక సామర్థ్యం సుమారు 1,822 కోట్ల లీటర్లుగా ఉంది.
వ్యవసాయ నిపుణుడు సుధీర్ పన్వార్ చెరకు మళ్లింపు ధరల పెరుగుదలకు కారణమని తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో పంట వ్యాధుల కారణంగా చక్కెర రికవరీ తగ్గిందని చెప్పారు.
ప్రపంచంలోనే ప్రధాన చక్కెర ఎగుమతి దేశాల్లో భారత్ ఒకటి. 2021-22 సీజన్‌లో 1.2 కోట్ల టన్నులకు పైగా చక్కెర భారత్ ఎగుమతి చేసింది. అయితే దేశీయ సరఫరాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. 2025-26 సీజన్‌లో సుమారు 20 లక్షల టన్నుల ఎగుమతులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. 2026 మే 13 నుంచి సెప్టెంబర్ 30 వరకు చక్కెర ఎగుమతులను నిషేధించింది. అయినా దేశీయ ధరలు తగ్గలేదు. అందుకే చక్కెరపై ఉన్న 100 శాతం దిగుమతి సుంకాన్ని తొలగించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దిగుమతులు పెరిగితే పండుగల సమయంలో దేశీయ సరఫరా మెరుగుపడే అవకాశం ఉంది.
Also Read: దెయ్యాల కోటలు.. దేశంలోని ఈ హిల్ స్టేషన్లలో పిశాచాలు ఉన్నాయట.. వెళ్లడానికి ధైర్యముందా?
పెద్ద మొత్తంలో చక్కెర వినియోగించే సంస్థల కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నెలకు 10 మెట్రిక్ టన్నులకు పైగా ఉపయోగించే సంస్థలు 15 రోజులకంటే ఎక్కువ నిల్వ ఉంచకూడదు. ఈ నిబంధన సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. నిబంధనలకు వ్యతిరేకంగా చక్కెర నిల్వలు దాచడం, కృత్రిమ కొరత సృష్టించడం వంటి చర్యలను అడ్డుకోవడమే దీని లక్ష్యం.
Also Read: ఒక్క క్షణంలో కథ అల్లేస్తారు.. ఈ పేర్లు గలవారు సాకులు చెప్పడంలో ఎక్స్‌పర్ట్
ఇథనాల్ విధానం, చక్కెర ధరల పెరుగుదలపై రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. చెరకును ఎథనాల్‌కు మళ్లించడం వల్ల చక్కెర సరఫరా తగ్గిందని ఆయన ఆరోపించారు.
ఇంధన భద్రత, రైతుల ప్రయోజనాలు, వినియోగదారులపై ధరల భారం మధ్య ప్రభుత్వం సమతుల్యత సాధించాలి. పండుగల సమయంలో చక్కెర ధరలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవడం ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారింది.
Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్
చక్కెర ధరల పెరుగుదలపై సామాజిక కార్యకర్త, టీమ్ భారత్ వ్యవస్థాపకుడు తహసీన్ పూనావాలా విమర్శలు చేశారు. ఇథనాల్ తయారీకి చెరకును మళ్లించడం వల్ల చక్కెర కొరత ఏర్పడిందని ఆరోపించారు. ఈ విధానం వల్ల రాజకీయ నాయకులు, వారి కుటుంబాలు లాభపడ్డారని అన్నారు. E20 అమలుకు వ్యతిరేకంగా ఆగస్టు 22, 23 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన, నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు.