Sreesanth Slams Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంటే మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కు అస్సలు పడదన్న సంగతి తెలిసిందే. మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా గంభీర్ పై విమర్శలు చేస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి గంభీర్ ను టార్గెట్ చేసి, శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంభీర్ పీకిందేమీ లేదని…సంజు శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కారణంగానే 2026 టీ20 ప్రపంచ కప్ వచ్చిందని వెల్లడించారు. టీమిండియా విజయానికి సరైన ప్రణాళికలు సంజు, సూర్య చేశారని, వాళ్లే వరల్డ్ కప్ హీరోలు అంటూ ప్రశంసలు కురిపించారు. కానీ గంభీర్ వల్లే వరల్డ్ కప్ వచ్చిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ టీమిండియా విజయాల క్రెడిట్ గంభీర్ కు ఇవ్వొద్దంటూ ఫైర్ అయ్యారు. దీంతో గౌతమ్ గంభీర్ పై శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహారంపై శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫ్రీతో పాటు ఆసియా కప్ 2025 టోర్నమెంట్లు వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. గంభీర్ రాకముందే టీమిండియాను రాహుల్ ద్రావిడ్ బలంగా తయారు చేశాడని కొనియాడారు. కానీ ఆ క్రెడిట్స్ మొత్తం తన ఖాతాలో గంభీర్ వేసుకున్నాడని మండిపడ్డారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో సంజు శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ లు ఆడినట్టు గుర్తు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా సంజు నిలిచినట్టుగా వెల్లడించారు. అటు టీమిండియా అవసరాలకు తగ్గట్టుగా, మ్యాచ్ గెలిచే విధంగా సూర్య కుమార్ యాదవ్ నిర్ణయాలు తీసుకున్నాడన్నారు. ఇలా సంజు, సూర్య ఇద్దరూ టీమిండియాను గెలిపించారని గుర్తు చేశారు. అంతేకానీ గంభీర్ పీకిందేమీ లేదంటూ విమర్శలు చేశారు. గంభీర్ పెద్ద ఛీటర్ అని, ఇతరుల క్రెడిట్ దొంగిలిస్తాడని పరువు తీశారు.
హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత, టెస్టుల్లో టీమిండియా పరిస్థితి దారుణంగా తయారైందని శ్రీశాంత్ ఆగ్రహించారు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్ట్ సిరీస్ లలో ఘోరంగా టీమిండియా ఓడిపోయిందని గుర్తు చేశారు. దీనికి కారణంగా గంభీరే అన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా గెలవాలంటే గంభీర్ ను కాదని మెంటార్ గా ధోనిని దించాలని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కోరారు.