Ranveer Allahbadia Supreme Court | ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ సహా అతని పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని అతను చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి (CJI) బెంచ్ తిరస్కరించింది. ఇండియాస్ గాట్ లాటెంట్ వేదికలో ఒక పోటీదారుడిని ఉద్దేశించి రణవీర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో అతనిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులన్నింటినీ ఒకే ప్రదేశంలో కలిపి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రణవీర్.. గువాహటి పోలీసులు జారీ చేసిన సమన్ల కారణంగా అరెస్ట్ అయ్యే భయంతో ముందస్తు బెయిల్ కోసం కూడా అర్జీ సమర్పించాడు. ఈ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టనుంది.
అయితే.. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేయాలని రణవీర్ తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని సీజేఐ బెంచ్ తిరస్కరించింది. కోర్టు రిజిస్ట్రీని సంప్రదించమని సూచించింది.
రణవీర్ అల్హాబాదియాకు బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా గణనీయమైన ఫాలోయింగ్ ఉంది. అయితే, స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో పాల్గొన్న రణవీర్, ఒక అభ్యర్థిని ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదానికి గురయ్యాడు. అతను ఆ మహిళా అభ్యర్థి తల్లిదండ్రులను గురించి అసభ్యంగా ప్రస్తావించడంతో వివాదం మరింత తీవ్రమైంది. “మీరు మీ తల్లిదండ్రులు పడక సుఖం అనుభవిస్తుంటే చూస్తూ ఉంటారా? లేక వారితోపాటు పాల్గొంటారా?” అని కార్యక్రమంలో రణ్‌వీర్ చాలా అశ్లీలంగా ప్రశ్నించి నవ్వాడు. అతని వ్యాఖ్యలపై మిగతా షో సభ్యులు కూడా నవ్వారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి.
Also Read: ప్రైవేట్ విమానంలో బ్యాంకాక్ బయలుదేరిన మంత్రి కుమారుడు.. గాల్లోనే కిడ్నాప్?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోపాటు అనేక రాజకీయ నేతలు, సినిమా ప్రముఖులు మరియు ఇతర యూట్యూబర్లు కూడా రణవీర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో అతను సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేశాడని వారు ఖండించారు. చివరికి రణవీర్ క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివాదం తగ్గలేదు.
తగ్గిపోతున్న ఫాలోవర్లు..
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేయడంతో.. యూట్యూబ్ రణ్‌వీర్ వ్యాఖ్యలు ఉన్న వీడియోను తొలగించింది. అయినప్పటికీ, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనేకమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం వల్ల అతని 16 మిలియన్ల ఫాలోవర్లు క్రమంగా తగ్గిపోతున్నారు. ఇప్పటికే అతనిపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, ఈ వివాదం పార్లమెంట్ వరకు చేరుకుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ లేఖ రాయనున్నది. మరోవైపు, సమయ్ రైనా మరియు ఇండియాస్ గాట్ లాటెంట్ నిర్వాహకులపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే ఈ షో సభ్యులపై మహారాష్ట్ర సైబర్ విభాగం కేసు నమోదు చేసింది. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ఈ నెల 17వ తేదీన రణవీర్ అల్హాబాదియా, సమయ్ రైనాలను తమ ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.