Tamil Nadu Governor Supreme court| తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరుపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట కలిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ ఆర్‌ఎన్ రవికుమార్ వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు ఆమోదం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
తమిళనాడు ప్రభుత్వం పది బిల్లులను ప్రతిపాదించగా, గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆ బిల్లులకు ఆమోదం ఇవ్వడం ఆలస్యం చేశారు. ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జేబి పార్థీవాలా మరియు ఆర్. మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సమయంలో, గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరును సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా విమర్శించింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమంటూ తీర్పు ఇచ్చింది. గవర్నర్ చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
‘‘10 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయాలన్న గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం. గవర్నర్ బిల్లును పునఃపరిశీలనకు వెనక్కి పంపాక.. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన తర్వాత రెండోసారి ఆ బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేయలేరు. ఈ బిల్లులను గవర్నర్‌కు తిరిగి సమర్పించిన తేదీ నుంచే వీటిని ఆమోదం పొందినట్టుగా పరిగణించాలి. మరోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను ప్రభుత్వం సమర్పించిన తర్వాత గవర్నర్ ఆమోదించాల్సిందే.’’ అని సుప్రీం ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
Also Read: మాజీ స్పీకర్ మరణానికి నకిలీ వైద్యుడే కారణం.. ఛత్తీస్ గడ్‌లో కలకలం
అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్‌ఎన్ రవి (Governor RN Ravi)కి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును పాస్ చేసి ఆమోదం కోసం పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లుకు ఆమోదముద్ర వేయడం, సమ్మతిని నిలుపుదల చేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం వంటివి చేస్తారు. తర్వాత మళ్లీ సభ దానిని ఆమోదిస్తే.. గవర్నర్ సమ్మతితో వాటిని నిలిపేయడం కుదురదు. కానీ దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలకు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావిస్తే.. ఆవిధంగా రిజర్వ్ చేసే వీలు ఉంది.
శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్. రవికి పంపగా ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడం లేదని, వాటిని పున:పరిశీ లించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. రెండోసారి బిల్లులు ఆమోదించినా ఆయన తీరు మారడం లేదంటూ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీం తీర్పు వెలువరించింది.