Allahabad HC Rape Attempt| అలహాబాద్ హైకోర్టు ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ తీర్పులోని కొన్ని మాటలు ద్విసభ్య బెంచ్‌కి బాధాకరంగా అనిపించాయని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నుంచి వివరణలు కోరుతూ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ తీర్పు ఇచ్చిన జడ్జి రామ్ మనోహర్ నారాయణపై కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది.
అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ నారాయణ మిశ్రా ఈ కేసుల విచారణ సమయంలో.. బాలిక దుస్తులు లాగడం, వక్షోజాలను తాకడం వంటి చర్యలు అత్యాచార నేరం కిందకు రావని తీర్పు చెప్పారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ కేసును పరిశీలించడానికి ముందుకు వచ్చింది. జస్టిస్ బీ.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ విచారణను నిర్వహించింది.
ఈ నెల 17న ఒక కేసు విచారణ సమయంలో హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై గౌరవాన్ని తగ్గించేవిగా ఉన్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మాటలు మేధావుల నుండి సామాన్య ప్రజల వరకు ఆందోళనను కలిగించాయి.
“అలహాబాద్ హైకోర్టు తీర్పు కాపీ చదివేటప్పుడు మనసుకు బాధ కలిగింది. ఇది సున్నితమైన విషయం అనే భావన లేకుండా తీర్పు ఇచ్చారు.. ఇదేదో క్షణికంగా చేసినది కాదు, నాలుగు నెలల పాటు ఆలోచించి ఇచ్చిన తీర్పు. ఇది పూర్తి స్పృహతో ఇవ్వబడిందని స్పష్టమవుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తీర్పుపై స్టే ఇవ్వాలని మేం ఆలోచిస్తుంటాం. కానీ, ఈ తీర్పులోని 21, 24, 26 పేరాలు చదివాక అమానుషంగా అనిపించాయి. అందుకే మేం స్టే ఇస్తున్నాం” అని సుప్రీంకోర్టు పేర్కొంది.
Also Read: ఉచితంగా భూమి తీసుకొని పేదలకు వైద్యం అందించరా?.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిపై సుప్రీం ఆగ్రహం
సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా బెంచ్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్.. “ఇది చాలా తీవ్రమైన విషయం. సున్నితత్వం లేకుండా జడ్జి తీర్పు ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయి. ఆయన గురించి ఇలా మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం” అని తుషార్ మెహతాకు చెప్పారు.
“వీ ద విమెన్ ఆఫ్ ఇండియా” అనే మహిళా సంక్షేమ సంస్థ ఆందోళనలు చేపట్టడంతో బాధితురాలి తల్లి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు స్వయంగా ఈ కేసును పరిశీలించింది. అయితే అంతకుముందే అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబడింది. కానీ.. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న బీ. వర్మ దానిని పరిగణలోకి తీసుకోలేదు.
ఘటన వివరాలు:
2021 నవంబరులో ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుండి తిరిగి వస్తుండగా, ఆ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వారిని సమీపించి, బాలికను ఇంటి దగ్గర దింపుతామని బైక్‌పై ఎక్కించుకున్నారు. మార్గంలో ఆమెను అసభ్యంగా తాకుతూ, కల్వర్టు కిందకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. బాలిక కేకలు వేయడంతో పొలాల్లో పనిచేసేవారు అక్కడికి చేరుకున్నారు. అది చూసి నిందితులు పారిపోయారు. ఈ కేసులో మార్చి 17న అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా.. “మహిళ వక్షోజాలను తాకడం, దుస్తుల విప్పేయడానికి ప్రయత్నించినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదు. అత్యాచార ప్రయత్నం అవుతుంది. ” అని నిందితుల పక్షంగా తీర్పు ఇచ్చారు.
ఈ తీర్పు వివాదాస్పదం కావడంతో.. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి అన్నపూర్ణా దేవి కూడా ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నాయని ఆమె హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ విచారణను ప్రారంభించింది.