Street dogs: ఇటీవల దేశంలో వీధి కుక్కల దాడుల కేసులు పెరిగిపోతున్న తరుణంలో, ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకి రావడానికే వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న పౌరులు, మున్సిపాలిటీల మధ్య విభేదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇదే విషయంపై పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తుల వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.
ఈ కేసు నేపథ్యం ఉత్తరప్రదేశ్‌కి చెందిన అలహాబాద్ హైకోర్టు 2025 మార్చిలో ఇచ్చిన తీర్పుతో మొదలైంది. పిటిషనర్ వాదన ప్రకారం, తాను Animal Birth Control Rules, 2023 ప్రకారం వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నానని, కానీ స్థానిక మున్సిపాలిటీ తనపై వేధింపులకు దిగుతోందని ఆరోపించారు. ఈ నిబంధనల ప్రకారం.. వీధి కుక్కలకు ఆహారం పెట్టే బాధ్యత ఆ ప్రాంత రహదారి సంక్షేమ సంఘాలు లేదా అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు లేదా మున్సిపల్ అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు బెంచ్‌లో న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా స్పష్టంగా స్పందించారు. జంతువులకు అంత స్పేస్ ఉండాలి, కానీ మనుషులకు కాదు కదా అంటూ ప్రశ్నించారు. మీ ఇంట్లోనే షెల్టర్ పెట్టండి. అక్కడికే అన్ని కుక్కల్ని తెచ్చి ఆహారం పెట్టండి. మీకు ఎవరైనా అడ్డుపడుతున్నారా? అని నేరుగా ప్రశ్నించారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది మాత్రం.. తాను నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నానని, గ్రేటర్ నోయిడాలో మున్సిపాలిటీ ప్రత్యేకంగా ఆహార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ నోయిడాలో అలాంటివి లేవని పేర్కొన్నారు. వీధిలో ఎక్కువగా ప్రజలు రాకపోయే ప్రదేశాల్లో ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తులు.. మీరు ఉదయాన్నే సైకిల్ తొక్కుతారా? ఒకసారి తొక్కి చూడండి, ఏమవుతుందో తెలుస్తుందని ఉదహరించారు. పిటిషనర్ చెప్పినట్లు తాను వాకింగ్ కు వెళ్లినప్పుడు చాలా వీధి కుక్కలు కనిపించాయని చెప్పడంతో, వాకర్లకే ప్రమాదం.. బైకర్లకు అయితే ఇంకా ప్రమాదమని బెంచ్ అభిప్రాయపడింది.
ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మరో వాదనతో కలిపి విచారణకు తీర్పు వాయిదా వేసింది. పిటిషనర్ హైకోర్టులో కోరింది ఏమిటంటే.. వీధి కుక్కల రక్షణ కోసం Animal Birth Control Rules అమలు చేసే విషయంలో Prevention of Cruelty to Animals Act, 1960 నిబంధనలను పాటించాలన్నది. అయితే హైకోర్టు స్పందిస్తూ.. వీధి కుక్కల రక్షణ తప్పనిసరి అయినా, ప్రజల రోడ్డుపై సంచారాన్ని దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొంది.
Also Read: Visakhapatnam vs Vijayawada: ఏపీలో విశాఖ తర్వాతే విజయవాడ.. ఈ క్రెడిట్ ఆ నగరానికే ఎందుకు?
ఇటీవల వీధి కుక్కల దాడుల కారణంగా కొన్ని ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ప్రస్తావిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలపై తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. అందువల్ల అధికార యంత్రాంగం బాధ్యతగా స్పందించి.. వీధి కుక్కలను రక్షించడమే కాకుండా, రోడ్డుపై నడిచే సామాన్యుల రక్షణకు కూడా చొరవ చూపాలని సూచించింది. దీనితో పిటిషన్‌ను విచారణ ముగిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఈ తీర్పులతో దేశవ్యాప్తంగా వీధి కుక్కల ఫీడింగ్ పాయింట్లపై, అలాగే ప్రజల భద్రతపై చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఒకవైపు జంతుప్రేమ, మరోవైపు రోడ్డుపై నడిచే పాదచారుల భద్రత… ఈ రెండు మధ్య సమతుల్యత ఎలా సాధించాలి? అన్నది ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న అసలైన ప్రశ్న.