CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాష్ట్ర ఎమ్మెల్యేలకు బంపరాఫర్ ఇచ్చారు. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున కార్లను కేటాయించనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో పాటు వాటి నిర్వహణ, ఇంధనం, ఇతర సిబ్బంది ఖర్చుల కోసం నెలకు భారీ అలవెన్సులను సైతం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రకటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ భారీ ఖర్చు వెనుక ఉన్న కారణాన్ని సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వాహనాలు ఎంతో అవసరమన్నారు. ‘ప్రభుత్వ వాహన సదుపాయం కల్పించడం వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత దగ్గరగా ఉండేందుకు వీలు కలుగుతుంది. అంతేకాకుండా పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడానికి ఇది దోహదం చేస్తుంది’ అని సీఎం విజయ్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచినవారని సీఎం విజయ్ అన్నారు. వారిలో చాలామంది పేద, మధ్యతరగతి నేపథ్యం ఉన్నవారని గుర్తుచేశారు. ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం అందించే ఈ రవాణా సదుపాయం వారికి ఎంతో లబ్ధి చేకూరుస్తుందని తెలిపారు. కాగా, ఇటీవలే వీసీకే పార్టీ ఎమ్మెల్యే జోతిమణి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన వెసులుబాటును కల్పించాలని కోరారు. ప్రత్యేకంగా కార్లు కేటాయించాలని సీఎం విజయ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ప్రభుత్వం తరపున కారు, డ్రైవర్ ను ఇవ్వడంతో పాటు వాహన నిర్వహణ కోసం ప్రత్యేకంగా అలవెన్స్ లను సైతం విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. వాహనం ఇంధనం, డ్రైవర్ జీతం, రీపేర్ల ఖర్చుల కోసం ప్రతినెల రూ.75,000 ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు కేటాయించనుంది. అంతేకాకుండా అధికారిక కార్యకలాపాలు, ఆఫీసు నిర్వహణ చూసుకోవడానికి ప్రైవేట్ కార్యదర్శిని నియమించుకునేందుకు నెలకు మరో రూ.25,000 గ్రాంట్‌గా ఇవ్వనుంది. అంటే ఒక ఎమ్మెల్యేకు కారుతో పాటు ప్రతినెల వాహన ఖర్చులు, సెక్రటరీ జీతం కింద మొత్తం రూ.1,00,000 రూపాయలు అందనున్నాయి.
అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఈ ప్రకటనపై మెజారిటీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. టీవీకే మిత్రపక్షమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే తరగై కథ్‌బర్ట్ మాట్లాడుతూ.. సీఎం విజయ్ నిర్ణయం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బయటకు చెప్పకపోయినా లోలోపల ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తారని అన్నారు. మరోవైపు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్ మోహన్ సైతం ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది ఎమ్మెల్యేలకే కాకుండా డ్రైవర్లు, ప్రైవేట్ కార్యదర్శులుగా చేరే ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు.
Also Read: Bigg Boss Telugu 10: ఇదేంట్రా నాయనా.. కంటెస్టెంట్స్ కు ఒక్కరోజుకు లక్షల్లో రెమ్యూనరేషనా?
అయితే ప్రతిపక్ష డీఎంకే (DMK) మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర ఖజానాపై ఇది అనవసర భారం మోపుతుందని మండిపడింది. డీఎంకే అధికార ప్రతినిధి ఎ. శరవణన్ ఈ విషయమై స్పందిస్తూ.. ‘234 మంది ఎమ్మెల్యేలకు కొత్త కార్లు కొనడం, వాటికి ప్రతి నెలా లక్షల రూపాయల అలవెన్సులు ఇవ్వడం వల్ల ప్రజాధనం విపరీతంగా వృథా అవుతుంది. అదనంగా ఈ భారాన్ని మోయాల్సిన అవసరం ప్రస్తుతం ప్రభుత్వానికి ఏమొచ్చింది?’ అని నిలదీశారు.