TamilNadu Hindi Delimitation| తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హిందీ భాష, లోక్‌సభ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్) అనే అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. సీఎం స్టాలిన్ హిందీని వ్యతిరేకించడం తమిళనాడుకు లోక్‌సభ సీట్లు తగ్గించబడుతున్నాయని ఆరోపించడం ద్వారా ఒక ఉద్యమాన్ని రేకెత్తించారు. ఈ ఉద్యమం తమిళులను తమ భాష, సంస్కృతి పట్ల ఏకం చేస్తోంది. దీనీకి ఉదాహరణగానే తమిళనాడులో బుధవారం అన్ని పార్టీల సమావేశం జరిగింది. స్టాలిన్ అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో విజయం సాధించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష అన్నా డీఎంకే, కొత్తగా ఏర్పడిన హీరో విజయ్ పార్టీ టివికె పార్టీలు కూడా రావడం గమనార్హం.
ఈ సభలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజేపీ హిందీ భాషను బలవంతంగా హిందీయేతర రాష్ట్రాలపై రుద్దాలని ప్రయత్నిస్తోందని తద్వారా ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. అందుకే తమిళులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.
Also Read: గాల్లోనే బర్డ్‌ఫ్లూను పసిగట్టే పరికరం వచ్చేసింది.. 5 నిమిషాల్లోనే కనిపెట్టేస్తుంది
అఖిలపక్ష సమావేశంలో.. 1971 జనాభా లెక్కల ప్రకారం.. లోక్‌సభ సీట్ల పునర్విభజన జరగాలని దక్షిణ రాష్ట్రాల అన్ని పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని తీర్మానించారు. కొత్తగా టివికె పార్టీ పెట్టిన విజయ్ కూడా డీలిమిటేషన్ వల్ల పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల తగ్గిపోతుందని.. ఇందుకు అంగీకరించకూడదని పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి నిజంగా తమిళ భాషపై ప్రేమ ఉంటే రాష్ట్రంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీ తొలగించాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ భాష, పునర్విభజన ఉద్యమంతో స్టాలిన్ దక్షిణాదిన తన నాయకత్వాన్ని చూపించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ వంటి ఇతర దక్షిణ రాష్ట్రాలు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశాలు తక్కువగా కనిపస్తున్నాయి.
2026లో జరగునున్న డీలిమిటేషన్ ప్రకారం.. తమిళనాడులో 8 లోక్‌సభ సీట్లు తగ్గొచ్చు, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరగొచ్చు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్లు తగ్గొచ్చు లేదా ఉత్తర భారతంతో పోలిస్తే చాలా తక్కువ శాతంలో సీట్ల పెంపు ఉంటుంది. అంటే డీలిటేషన్‌తో దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం దక్షిణాదిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే బీజేపీ ఈ పునర్విభజనను జనాభా ప్రకారం న్యాయంగా చేస్తామని చెప్పుతున్నప్పటికీ, దక్షిణ రాష్ట్రాలు ఇందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి.
మొత్తంమీద.. ఈ భాష, పునర్విభజన ఉద్యమం తమిళనాడులో రాజకీయాలను రగిలించింది. కానీ ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఇందులో పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే స్టాలిన్ ఈ అంశాన్ని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కానీ తమిళులు తమ భాష, సంస్కృతి, హక్కుల పట్ల ఏకమవుతారని గతంలో జల్లికట్లు సమయంలోనూ.. తాజాగా డిలీమిటేషన్ నేపథ్యంలోనూ నిరూపితమైంది. అయితే అలాంటి ఐకమైత్యం తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో కనబడక పోవచ్చు.