Cool Roof in India: ఒక రాష్ట్రం చిన్న ఐడియాతో చేసిన ప్రారంభం ఇప్పుడు ప్రపంచానికి మార్గం చూపిస్తోంది. వేసవిని చల్లబరిచే ఆ వినూత్న ఆలోచనకు ఐక్యరాజ్యసమితి కూడా శభాష్ చెప్పింది. ఇప్పుడు ఆ ఐడియా పేరు దేశమంతా మారుమోగుతోంది. ఆ చల్లదన రహస్యమేంటో మీరూ తెలుసుకోండి.
తమిళనాడు ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి (UN) నుంచి అరుదైన ప్రశంసలు అందాయి. కారణం? వేసవి వేడి నుండి ప్రజలను రక్షించేందుకు అక్కడ అమలు చేస్తున్న కూల్ రూఫ్ అనే స్మార్ట్ ప్రాజెక్ట్! ఈ చిన్ని ఐడియాతో వారు చేస్తున్న పనిచూసి, అది వాతావరణ మార్పులను తగ్గించడంలో ప్రపంచానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుందని యూఎన్ గుర్తించింది.
కూల్ రూఫ్ అంటే ఏమిటి?
అంటే కూల్ రూఫ్ అంటే ఏమిటి? కొందరికి కొత్తగా అనిపించవచ్చు. నిజానికి ఇది సులభమైన కాన్సెప్ట్. మన ఇళ్లపై తెల్లటి రంగు పూత వేస్తే దాని వల్ల ఎండ కిరణాలు తక్కువగా గ్రహించబడి, ఇంట్లో వేడి తక్కువగా ఉంటుంది. పైకప్పు ద్వారా వచ్చే వేడి 30 నుంచి 40 శాతం తగ్గుతుంది. దీని వల్ల ఇంట్లో చల్లదనం పెరుగుతుంది, కరెంటు బిల్లులు తగ్గుతాయి, ముఖ్యంగా వేడి రోజులలో ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు.
ఫస్ట్ ఎక్కడ?
తమిళనాడు ప్రభుత్వం చెన్నై నగరంలో మొదట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వేలాది స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని గిరిజన ప్రాంతాల ఇళ్లపై ఈ కూల్ రూఫ్ పూత వేశారు. మొదట్లో చిన్న స్థాయిలో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు పెద్ద విజయంగా మారింది. దీని ప్రభావం చూసిన తర్వాత మరిన్ని భవనాల్లో ఈ పద్ధతిని విస్తరించారు.
ఈ ప్రాజెక్టును యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ మిటిగేషన్ ఇన్నోవేషన్ గా ప్రకటించింది. అంటే ఇది వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో ఒక కొత్త ఆవిష్కరణగా గుర్తింపు పొందినట్టే. ముఖ్యంగా ఎక్కువ తాపం ఉన్న నగరాల్లో.. దీనివల్ల నివాస భవనాల్లో ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా, విద్యుత్ వినియోగం కూడా బాగా తగ్గుతుంది.
Also Read: Mahanandi Trip: మహానంది వెళుతున్నారా? ఈ మిస్టరీ ప్లేసెస్ మిస్ కావద్దు!
ఏంటి ప్రయోజనాలు?
ఈ ప్రాజెక్ట్ వల్ల సాధారణ ప్రజలు కూడా తక్కువ ఖర్చుతో చల్లని ఇంటిని పొందగలుగుతున్నారు. ఎలాంటి ఆధునిక గ్యాడ్జెట్లు లేకుండా, కేవలం పైకప్పుకు తెల్ల రంగు వేయడం ద్వారా మనం ఎండను ఎదుర్కొనగలుగుతున్నాం. చెన్నై లాంటి మెగాసిటీ నగరాల్లో ఇది బాగా పని చేస్తోందంటే ఊహించండి.
ఇంకొన్ని రాష్ట్రాలు కూడా తమిళనాడు మాదిరిగానే ఆలోచించాలని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ విధానం ఖర్చు తక్కువ.. ప్రయోజనం ఎక్కువ. విద్యుత్ బిల్లులు తగ్గిపోవడం వల్ల సామాన్యులకు ఉపశమనం. ఎసి లేకపోయినా గదిలో చల్లదనం ఉండడం అనేది ఒక వాస్తవం. గాలి కాలుష్యం తగ్గించడంలో కూడా ఇది దోహదపడుతుంది. అంతేకాదు, ఇది ఊహించని విధంగా వాతావరణ మార్పులపై కూడా ప్రభావం చూపుతుంది.
ఇప్పటికే హైదరాబాదులోనూ కూల్ రూఫ్ పాలసీపై ప్రకటనలు వచ్చాయి. కానీ తమిళనాడు మాదిరిగా ప్రజల వరకు చేర్చే స్థాయిలో అమలు చేయడం అవసరం. ఒక్కో ఇంటికి ఇలా తెల్లటి పైకప్పులు పెడితే, అది ఒక చిన్న చర్య కాదు.. పెద్ద పరివర్తనకు బీజం వేయడమే అవుతుంది. వాతావరణ మార్పుల యుగంలో మన ఇంటి పైకప్పు నుంచే పరిష్కారం మొదలవుతుంది. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకే ఐక్యరాజ్యసమితి, తమిళనాడు రాష్ట్రాన్ని మెచ్చుకుంది.. అభినందించింది.