Techie Suicide Judge bribe| కట్నం వేధింపుల కేసులో ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు, న్యాయమూర్తి తనను అవమానించారని మృతుడు అతుల్ సుభాష్ ఆత్మహత్యకు ముందు తీవ్ర ఆరోపణలు చేశాడు. అయితే ఇప్పుడు అతుల్ మరణానంతరం.. అతని తండ్రి మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. న్యాయమూర్తి ఈ కేసు కొట్టివేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారని చెప్పారు. తన కొడుకుపై ఒకటి తరువాత మరొకటి కేసుల పెట్టి పోలీసులు, కోర్టు వేధించారని.. దీంతో అతను మానసికంగా కుంగిపోయి తన ప్రాణాలు త్యజించాడని చెప్పారు.
బెంగుళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో డిప్యూటీ జెనెరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసే అతుల్ సుభాష్ (34).. గత సోమవారం బెంగుళూరులోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయేముందు ఒక వీడియో రికార్డ్ చేసి.. 24 పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ మరణించాడు. తన భార్య, ఆమె బంధువులు పెట్టిన చిత్రహింసల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. చెప్పాడు. అయితే సూసైడ్ నోట్ లో న్యాయమూర్తి తనను కేసు కొట్టివేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశాడనే విషయం కూడా ప్రస్తావించాడు.
బీహార్ రాష్ట్రానికి చెందిన అతుల్ సుభాష్ తల్లిదండ్రులు బిహార్ లోని సమస్తిపూర్ లో నివసిస్తున్నారు. ఇప్పుడు అతుల్ తండ్రి పవన్ కుమార్ మీడియా ముందుకు వచ్చి అతుల్ భార్య, కట్నం వేధింపుల కేసు విచారణ చేసిన న్యాయమూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: భార్యకు భరణం ఎంత ఇవ్వాలో లెక్కలు చెప్పిన సుప్రీం కోర్టు..
“నా కొడుకు చాలా సార్లు దేశంలో అవినీతి పెరిగిపోయిందని చెప్పేవాడు. కానీ అతను పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ధైర్యం చూపాడు. అయితే పూర్తి వివరాలు మాతో చెప్పేవాడు కాదు. అతనిపై ఆధారాలు లేని కేసులు పెట్టి మానసికంగా వేధించారు. కరోనా సమయంలో అతుల్ భార్య ఉత్తర్ ప్రదేశ్ లోని తన పుట్టింటికి వెళ్లింది. కొన్ని రోజుల తరువాత తిరిగి వస్తుందని భావించాం. కానీ ఆమె జనవరి 2021లో కట్నం వేధింపుల కేసు పెట్టింది. మేము ఇంటికి తిరిగి వచ్చి మాట్లాడాలని ఎంత చెప్పినా వినలేదు. తనతో పాటు అతుల్ కొడుకు కూడా ఉన్నాడు. కోర్టులో కేసు విచారణ కోసం అతుల్ వెళ్లాడు. మొదట్లో జడ్జి గారు మధ్యవర్తిత్వం చేసేందుకు రూ.20,000 ఆ తరువాత రూ.40,000 తీసుకున్నారు. కానీ ఇటీవల రూ.5 లక్షలు ఇస్తే కేసు కొట్టివేస్తానని చెప్పాడు.” అని అతుల్ తండ్రి ఆరోపించారు.
ఎంత ఒత్తిడి ఉన్నా తన కొడుకు సాధారణంగానే కనిపించాడని లోలోపల ఇంత మధనపుడుతున్నట్లు తనకు తెలియలేదని ఆయన వాపోయాడు. ఈ కేసులో తప్పుడు ఆరోపణలు, కోర్టులో అవినీతి గురించి సుప్రీం కోర్టు, భారత రాష్ట్రపతికి అతుల్ వివరంగా లేఖలు కూడ రాసినట్లు అతని తండ్రి పవన్ కుమార్ తెలిపారు.
ఈ కేసు విచారణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తలు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ వి కోటీశ్వ సింగ్.. కట్నం వేధింపుల చట్టం సెక్షన్ 498 Aని భర్తలను వేధించేందుకు కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని.. అన్ని న్యాయస్థానాలు ఇలాంటి కేసుల్లో జాగ్రత్త వహించాలని సూచినలు చేశారు.