Youtuber Pakistan Spy| జమ్ము కశ్మీర్ లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రవాద దాడి తరువాత ఒకవైపు ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా.. మరోవైపు దేశం లోపల పోలీసులు, విచారణ ఏజెన్సీలు దేశద్రోహుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పనిచేస్తూ భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసినట్లు తేలింది. జ్యోతితో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు.
యూట్యూబ్ లో ‘ట్రావెల్ విత్ జో’ అనే ఛానెల్ లో ఆమె భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటనకు సంబంధించి వీడియోలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె పాకిస్తాన్ కూడా వెళ్లింది. అక్కడి ప్రాంతాల్లో పర్యటించి ట్రావెల్ వీడియో చేయగా.. ఆమె ఛానెల్ బాగా పాపులర్ అయింది. అయితే అదే సమయంలో ఆమెపై పలువురు విమర్శలు కూడా చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. దేశ రాజధాని ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ లో అధికారి అయిన ఎహ్సాన్ రహీంపై భారత ప్రభుత్వం ఇటీవల ఆంక్షలు వేసి అతను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి. అతడిని బహిష్కరించింది. అయితే అతని గురించి చేసిన విచారణలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పేరుకు బయటపడింది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వీసాపై రెండుసార్లు పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆమె పాక్ హై కమిషన్ అధికారి ఎహ్సాన్ రహీంకు కీలక సమాచారాన్ని అందించింది. అంతేకాదు.. పాకిస్తాన్ గూఢాచారుల నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్‌లో విస్తరించి ఉంది. జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’ యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ.. అనుమానం రాకుండా భారత సైన్యం యొక్క్ కీలక సమాచారం చేరవేసింది. డానిష్ బహిష్కరణ తర్వాత జ్యోతి గూఢచార్యం బయటపడింది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్‌తో సంప్రదింపులు జరిపింది. గత రెండేళ్లలో జ్యోతి మూడుసార్లు పాకిస్తాన్‌తో పాటు చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌లలో పర్యటించింది. ఆమె ఒక పాక్ అధికారితో కలిసి బాలిలో వారం గడిపింది. పోలీసులు జ్యోతిని విచారణ చేస్తూ మరింత సమాచారం సేకరిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె పాకిస్తాన్ వెళ్లే ముందు జనవరి 2025లో కశ్మీర్ లోని పహల్గాంకు వెళ్లిందని తేలింది. గత సంవత్సరం ఇండియాలోని పాకిస్తాన్ ఎంబసీలో ఆమె ఇఫ్లార్ పార్టీకి కూడా వెళ్లింది. అక్కడ దానిష్ ఆమెను పార్టీలో ఇతర సభ్యులకు పరిచయం చేశాడు. అక్కడే ఆమెకు ఇతర పాకిస్తాన్ గూఢాఛారులకు పరిచయం ఏర్పడిందని పోలీసులు విచారణలో తేలింది. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాత్ర ఉండవచ్చని విచారణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: హనీట్రాప్‌లో పాక్ దౌత్యాధికారి.. బంగ్లాదేశీ యువతితో అశ్లీల వీడియోలు
హర్యానాలోని హిసార్ నగరంలో ఇంతకుముందు కూడా పాకిస్తాన్ గూఢాచారులు ఉన్నట్లు చాలాసార్లు తేలింది. ఆ నగరంలో ఇండియన్ మిలిటరీ కంటోన్మెంట్ ఉంది, ఆర్మీ హార్స్ బ్రీడింగ్ ఫామ్ తో పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపస్ కూడా ఉంది. పైగా అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా ఉంది. గతంలో అంటే 2001, 2003, 2005లో ముగ్గురు పాకిస్తానీ ఏజెంట్లు ఇండియన్ గుర్తింపు పత్రాలు సాధించి ఈ కంటోన్మెంట్ ప్రాంతంలో చొరబడ్డారు. వారంతా ఆర్మీ కీలక సమాచారం సేకరించి పాకిస్తాన్ గూఢాచార ఏజెన్సీ ఐఎస్ఐకి చేరవేస్తూ అరెస్ట్ అయ్యారు.