Uttarakhand UCC: దేశంలోనే తొలిసారిగా బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సోమవారం జనవరి 27, 2025 నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలులోకి వచ్చింది. ఇకపై ఆ రాష్ట్రంలో బహుభార్యత్వం నిషేధం విధించారు. పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో కలిసి సహజీవనం చేసే యువతి యువకులు ఇకపై తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆస్తిలో లింగ సమానత్వం. ఇలాంటి నిబంధనలతో కూడిన చట్టాలు ఈ రోజు నుంచి అమలవుతున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఆదివారం ప్రకటన చేశారు. యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులను శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు.
‘‘యూసీసీ అమలుతో సమాజంలో అనేక అంశాల్లో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు కల్పించడమే మా లక్ష్యం’’ అని సీఎం ధామి ప్రకటించారు. ఈ చట్టం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నివసించే పౌరలందరితో పాటు.. ఇతర రాష్ట్రాల్లో నివసించే ఉత్తరాఖండ్ పౌరులకు వర్తిస్తుందని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: ఇంట్లో అనుమాస్పద స్థితిలో మహిళ శవం.. మృతదేహాన్ని తిన్న పెంపుడు కుక్కలు
యూసీసీ ముఖ్యాంశాలు
వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, వీలునామాలు వంటి అంశాల్లో లింగ సమానత్వానికి ప్రాధాన్యం. అంటే ఆస్తిలో కొడుకు, కూతురు అనే తేడా లేదు. అందరికీ సమానంగా వాటా ఉంటుంది. ఈ చట్టం అన్ని మతాలకు చెందిన వారికి వర్తిస్తుంది. పైగా పెళ్లి చేసేందుకు పురుషులకు కనీస వయసు 21 సంవత్సరాలు. మహిళలకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వారిద్దరి మానసిక ఆరోగ్యంతో ఉండాలి. ఆ ఇద్దరి మధ్య వివాహం బంధానికి అన్ని అర్హతలుండాలి. అంటే మేనరికాలు లాంటివి. అన్ని మతాలకు ఒకే వివాహ వయస్సు విధానం.
వివాహ నిబంధనలతో పాటు సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించి, రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరిగా చేశారు. సహజీవనం ప్రారంభించేవారు ముందుగానే ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడే వారి బంధానికి చట్టబద్ధతతో హక్కులు కూడా లభిస్తాయి.
యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారు లేదా త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్)లో పని చేస్తున్న సైనికులు లేదా ఇతర అధికారుల కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌకర్యం ద్వారా వీలునామాను వేగంగా. సులభంగా రూపొందించుకునే అవకాశాన్ని కల్పించారు.
ఉత్తరాఖండ్ లో ఇకపై బహుభార్యత్వాన్ని నిషేధించారు. ఇస్లాం ప్రకారం చేసే హలాల్ విధానాన్ని నిషేధించారు.
అయితే నిబంధనలు ఉత్తరాఖండ్ లో నివసించే షెడ్యూల్డ్ ట్రైబ్స్ (తెగలు – ఆదివాసీలు)కు చెందినవారికి వర్తించవు. రాజ్యాంగం, కేంద్ర చట్టాల ప్రకారం ప్రత్యేక అధికారాలగల వ్యక్తులకు, సామాజిక వర్గాలకు కూడా ఈ చట్టం నుంచి కొన్ని మినహాయంపులు ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342, ఆర్టికల్ 366(25) షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్ టి) చట్టం ప్రకారమే వారికి మినహాయింపులు ఇచ్చారు.
యూసీసీ చట్టం అమలు జరిగిందిలా
ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2022 మే 27న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఒక సంవత్సరానికి పైగా కసరత్తు చేసి యూసీసీ ముసాయిదా బిల్లును రూపొందించింది.
2024 ఫిబ్రవరి 2: కమిటీ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
2024 ఫిబ్రవరి 7: బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది.
రాష్ట్రపతి ఆమోదం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తర్వాత, యూసీసీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు.
ఎన్నికల హామీకి అనుగుణంగా
2022 ఎన్నికల్లో యూసీసీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, రెండు సంవత్సరాల్లోనే ఈ హామీని అమలు చేసింది.
కాంగ్రెస్, ప్రతిపక్షాల విమర్శలు
కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఏకాభిప్రాయం లేకుండా తీసుకువచ్చిన ప్రయోగాత్మక ప్రాజెక్టుగా పేర్కొంది. ‘‘యూసీసీ అమలులో కూడా ఏకరూపత ఉండాలి. ఇది రాష్ట్రానికి పరిమితం కాకూడదు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ యుసిసి చట్టం కేవలం ముస్లింల సంప్రదాయాలను టార్గెట్ చేసే విధంగా ఉన్నాయని కూడా విమర్శలు వస్తున్నాయి. “ఈ చట్టం వివక్ష పూరితంగా ఉందని.. అందరికీ ఒకే చట్టమైతే హిందువులకు ప్రత్యేకంగా హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ ప్రకారం ఆదాపపన్ను ప్రత్యేక మినహాయింపులు ఎలా ఇస్తారని, అలాగే ఆదివాసీలకు మాత్రమే ఎందుకు మినహాయించారు. అందరికీ మునుపటి లాగే నిబంధనలు ఉన్నాయి. కానీ ముస్లింల పట్ల మాత్రమే వివక్ష చూపేవిధంగా యుసిసి చట్టం ఉంది” అని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.