ఈ ఏడాది వేసవి మొదలవకముందే సూర్యుడి ప్రతాపం కనపడుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరాదిలో కూడా వడగాలులు భయపెడుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఇక రాబోయే ఐదురోజులు ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని భారత వాతావరణ శాఖ(IMD) హెచ్చరించింది. భారీ వర్షాలు, ఉరుములతోపాటు వేడి గాలులు కూడా వీస్తాయని చెప్పింది.
ఏప్రిల్ 1 నుంచి మొదలు..
రాబోయే ఐదు రోజుల్లో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏప్రిల్-1 నుంచి స్పష్టంగా వాతావరణంలో మార్పులు కనపడతాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో చెదురు మదురు వర్షాలు పడతాయని చెప్పింది. గంటకు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పింది.
అప్రమత్తత అవసరం
ఏప్రిల్ 1, 2 తేదీల్లో మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ ఘఢ్, గుజరాత్ తోపాటు రాయలసీమ ప్రాంతంలో గంటకు 30 నుంచి 60 కి.మీ వేగంతో బలమైన గాలుల వీస్తాయని, అదే సమయంలో మెరుపులు, ఉరుములతో వర్షం పడుతుందని తెలిపింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు.. మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ, మహే, కర్నాటక, కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. మార్చి 29న పశ్చిమ బెంగాల్ లోని గంగా తీరప్రాంతాల్లో, మార్చి 29-30 తేదీలలో ఒడిశాలో వేడి గాలులు వీచే అవకాశం ఉంది. అసోం, త్రిపురలో మార్చి 29 నుండి 31 వరకు, గుజరాత్ లో మార్చి 29 నుండి ఏప్రిల్ 2 వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉంది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మార్చి 29న వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పులేవీ ఉండవు. ఆ తర్వాత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. కనీసం మధ్యలో వాన జాడ కూడా లేదు. వర్షాల గురించి గతంలో తీపి కబురు అందినా చివరకు ఒకటీ రెండు రోజులు మాత్రమే, అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడ్డాయి. ఈసారయినా తెలుగు రాష్ట్రాలను వరుణుకు కరుణిస్తాడో లేదో చూడాలి.
రైతులకు నష్టం..
అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడినా, రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే అవకాశముంది. అకాల వర్షంతో చేతికందిన పంటను కోల్పోవాల్సిన ఇబ్బంది ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరి కోతకు వచ్చింది. ఈ సమయంలో వర్షం పడితే దిగుబడి తగ్గిపోతుంది, పంట నష్టం జరుగుతుంది. ఇటీవల ఒకటి రెండు రోజులు కురిసిన వర్షాలకే రాయలసీమలో బొప్పాయి చెట్లు పూర్తిగా నేలకొరిగాయి. ఈసారి మామిడి దిగుబడి కూడా అంతంతమాత్రంగానే ఉంటుందనే అంచనాలున్నాయి. ఈ దశలో అకాల వర్షాలపై వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం రైతులను ఆందోళనలోకి నెడుతోంది.