India PoK issue : పహల్గాం ఉగ్రదాడి తర్వాత యావత్ భారత్ చేస్తున్న డిమాండ్ ఒక్కటే. పాకిస్తాన్ పని పట్టాల్సిందే. మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే. పీవోకే స్వాధీనం చేసుకోవాల్సిందే. అఖండ భారత్‌ను ఆవిష్కరించాల్సిందే. హిందువులంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. పాక్‌ను దెబ్బకొట్టాలంటే.. పీవోకే ను భారత్ తిరిగి ఆక్రమించుకోవాలని కోరుతున్నారు. మరి ఇది సాధ్యమేనా? పీవోకే మనదేనా? అఖండ భారత్‌ను మోదీ పునః స్థాపితం చేస్తారా? చరిత్రలో పీవోకే పై అసలేం జరిగింది? రాజకీయ, సైనిక కారణాలు ఎలా ఉన్నాయి?
పీవోకే ఎవరిది?
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK). 13వేల కిలోమీటర్ల వైశాల్యం ఉన్న భూభాగం. ఎక్కువ భాగం కొండలు, పర్వతాలే. 40 లక్షల పైచిలుకు జనాభా. అంతా ముస్లింలే. ఒకప్పుడు కశ్మీర్‌లో భాగంగా ఉండేది. అఖండ భారత్‌లో అంతర్భాగమనేది మన వాదన. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా ఉంది. అలాగని అదేమీ పాకిస్తాన్‌కు చెందింది కాదు. కానీ, పాక్ కంట్రోల్‌లోనే ఉన్న ప్రాంతం. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి పీవోకే చుట్టూ.
1947-48 ఇండో పాక్ వార్ :
దేశ విభజన జరిగిన తర్వాత.. కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. జమ్మూ కశ్మీర్‌పై కన్నుపడిన పాకిస్తాన్.. గిరిజనులను కశ్మీర్ రాజు హరిసింగ్ మీదకు ఉసిగొల్పింది. గిరిజనుల ముసుగులో పాక్ సైన్యం తిరుగబాటుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ దాడిని ఎదుర్కోలేని రాజా హరిసింగ్.. అప్పటి భారత ప్రభుత్వం సాయం కోరారు. కశ్మీర్‌ను ఇండియాలో విలీనం చేస్తేనే సహాయం చేయగలమని భారత ప్రభుత్వం తెలిపింది. అలా 1947 అక్టోబర్ 26న కశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. జమ్మూకశ్మీర్ రక్షణ, విదేశీ, కమ్యూనికేషన్ల నియంత్రణ ఇండియా చేతిలోకి వచ్చింది. వెంటనే భారత సైన్యం కశ్మీర్ రాజుకు సపోర్ట్‌గా రంగంలోకి దిగింది. అటునుంచి పాకిస్తాన్ నేరుగా యుద్ధంలో దిగింది. ఇరు దేశాల మధ్య వార్ జరిగింది. సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి సాయం కోరింది ఇండియా. కశ్మీర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించారు. కానీ, అది ఆచరణ సాధ్యం కాలేదు. 1949లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా.. అప్పటికే కశ్మీర్‌లోని కొంత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ తిరిగి వెనక్కి వెళ్లలేదు. ఆ ప్రాంతమే పీవోకే.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌గా మిగిలిపోయింది. అది ఇండియాదే అనేది భారత ప్రభుత్వ వాదన. 1971లో మరోసారి ఇండో పాక్ యుద్ధం జరిగింది. 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం కశ్మీర్ సమస్యతో సహా ద్వైపాక్షికంగా వివాదాలను పరిష్కరించడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. కానీ, పీవోకే పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.
పీవోకే స్వాధీనం సాధ్యమేనా?
హిమాలయాలు, పిర్ పంజాల్ శ్రేణులతో ఉన్న కఠినమైన పర్వతాలతో కూడిన భూభాగంలో పీవోకే ఉంది. శీతాకాలంలో మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. సైనికులను పంపించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం భారత్‌కు సవాళ్లతో కూడిన సాహసమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులే ఉన్న కార్గిల్ వార్ సమయంలో మన సైన్యానికి తీరని నష్టమే చేసిందని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మనం పీవోకే పై దాడి చేసినా.. పాక్ చూస్తూ ఊరుకుంటుందని అనుకోలేం. అది కూడా యుద్ధానికి దిగుతుంది. ఇప్పటికే పీవోకేలో పాకిస్తాన్ భారీ ఎత్తున ఆర్మీని మోహరించింది. శాశ్వత సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. ఇండియాకే ఆ ప్రాంతంపై సరైన పట్టు లేదు. పీవోకేలో యుద్దమే జరిగితే భారీ డ్యామేజ్ తప్పకపోవచ్చు. రెండూ అణ్వాయుధ దేశాలే కావడం మరింత ప్రమాదకరమైన అంశం.
పీవోకేలో చైనా చొరబాటు
అటు, చైనా సైతం పీవోకే లో మెళ్లిమెళ్లిగా చొరబడింది. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC) రూపంలో PoKలో చైనా పెట్టుబడులు పెడుతోంది. ఇండియా ఆ ప్రాంతంలో ఎంటర్ అయితే.. పాక్‌కు సపోర్ట్‌గా చైనా జోక్యం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. అది మరో సమస్యకు తెరలేపుతుంది. అలాగని వదిలేయలేం. పీవోకే కేంద్రంగానే పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులను నడుపుతుండటం ఆందోళన కలిగించే అంశం. వాటికి సర్జికల్ స్ట్రైక్స్ తరహా ఆపరేషన్లే సరైన సమాధానం అంటున్నారు.
పీవోకేపై భారత్ వ్యూహం ఇదే..
భారత ప్రభుత్వం దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, టెక్నాలజీ తదితర అంశాల మీదే ఎక్కవ ఫోకస్ పెడుతోంది. PoKని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రయత్నాలు చేసింది లేదు. యుద్ధం వల్ల కలిగే ఆర్థిక, ప్రాణ నష్టాలను దృష్టిలో పెట్టుకొని.. పీవోకే ను అంతగా పట్టించుకోవట్లేదనే చెప్పాలి. ఆ ప్రాంతంపై నేరుగా దాడి చేయడం తరహా చర్యల కంటే కూడా.. అవసరమైన సమయాల్లో.. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడుల వంటి పరిమిత సైనిక చర్యలనే ఎంచుకుంది ఇండియా. అయితే, వ్యూహాత్మకంగా వేచి చూసే ధోరణి అవలంభిస్తోందని విశ్లేషిస్తున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పటికే పీవోకే ప్రజలు పాకిస్తాన్ పాలనపై ఆగ్రహంగా ఉన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని మండిపడుతున్నారు. తాము ఇండియాలో కలుస్తామంటూ అప్పుడప్పుడూ ఉద్యమాలు కూడా చేస్తున్నారు. వాటిని పాక్ సర్కారు అణిచివేస్తూ వస్తోంది. ఎప్పటికైనా ఆ ఉద్యమాలు తిరుగుబాటుగా మారుతాయని.. అప్పుడు సరైన సమయంలో భారత్ తగు విధంగా జోక్యం చేసుకునేలా పరిస్థితులు అనుకూలిస్తాయని చెబుతున్నారు. అందుకే, ఇప్పుడే కాకపోయినా.. ఎప్పటికైనా పీవోకే మనదే అవొచ్చు. అఖండ భారత్ అసాధ్యమేమీ కాకపోవచ్చు. హోప్ ఫర్ ద బెస్ట్.
Also Read : మీ ఇంటికొచ్చి మరీ చంపేస్తాం.. ఆనాటి సర్జికల్ స్ట్రైక్ ఎలా జరిగిందంటే..
Also Read : ఉగ్రవాదంపై కశ్మీర్ ముస్లిం యువకుడి ఎమోషన్ వీడియో..