World Bank Job| వరల్డ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి శుభవార్త. ప్రపంచ బ్యాంక్ తాజాగా ఒక కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది. సాధారణ ఉద్యోగాలకు భిన్నంగా అర్థవంతమైన కెరీర్‌ను కోరుకునే ప్రతిభావంతులకు ఇది గొప్ప అవకాశం. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, ఇన్‌ఫ్రా అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో పనిచేస్తూనే విలువైన నైపుణ్యాలను పెంపొందించుకునే గోల్డెన్ ఛాన్స్ ఇది.
వరల్డ్ బ్యాంక్ గ్రూప్.. 2027 యంగ్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్ (YPP) కోసం దరఖాస్తులను సెప్టెంబర్ 1, 2026న ప్రారంభించనుంది. అంతర్జాతీయ అభివృద్ధి, ఆర్థిక విధానాలు, పబ్లిక్ పాలసీ వంటి రంగాల్లో కెరీర్ కోరుకునే యువ నిపుణులకు ఇది మంచి అవకాశం. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ, అంతర్జాతీయ అనుభవం, మెంటారింగ్, నాయకత్వ అభివృద్ధి వంటి అవకాశాలు లభిస్తాయి. వరల్డ్ బ్యాంక్‌తో పాటు IFC, MIGA వంటి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల్లో కూడా పని చేసే అవకాశం ఉంటుంది.
యంగ్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాల ప్రత్యేక కెరీర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌గా ఉంటుంది. ఇందులో అభ్యర్థులు.. టెక్నాలజీ పనులతో పాటు లీడర్‌షిప్ ట్రైనింగ్ పొందుతారు.
ముందుగా వరల్డ్ బ్యాంక్ గ్రూప్.. ప్రధాన కార్యాలయంలో పని చేసే అవకాశం ఉంటుంది. అనంతరం అంతర్జాతీయ ఫీల్డ్ రొటేషన్లలో పాల్గొంటారు.
అభ్యర్థులకు కోచింగ్, మెంటారింగ్, నెట్‌వర్కింగ్ అవకాశాలు కూడా అందుతాయి. పనితీరు ఆధారంగా రెండు సంవత్సరాల తర్వాత మరో ఐదేళ్ల ఉద్యోగ అవకాశం ఉంటుంది.
ఈ ప్రోగ్రామ్‌లో మూడు తప్పనిసరి రొటేషన్లు ఉంటాయి. ప్రతి రొటేషన్ సుమారు ఎనిమిది నెలలపాటు కొనసాగుతుంది. ఒక రొటేషన్ అభ్యర్థి ప్రధాన నైపుణ్యం, పని రంగానికి సంబంధించినదిగా ఉంటుంది. మరో రొటేషన్‌లో వరల్డ్ బ్యాంక్ గ్రూప్‌లోని ఇతర సంస్థలతో పని చేసే అవకాశం లభిస్తుంది.
కనీసం ఒక రొటేషన్ దేశంలోని వరల్డ్ బ్యాంక్ ఆఫీస్‌లో నిర్వహించాలి. ఈ పాలసీ ద్వారా అభ్యర్థులు అంతర్జాతీయ అనుభవాన్ని పొందుతారు.
అభ్యర్థులు.. ఆపరేషన్స్ లేదా స్పెషలైజ్‌డ్ ఫంక్షన్స్ విభాగాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తమ విద్య, అనుభవానికి సరిపోయే స్ట్రీమ్‌ను ఎంచుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్, విద్య, ఆరోగ్యం, ఫైనాన్స్, వ్యవసాయం, వాతావరణం వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. పర్యావరణం, ఇంధనం, రవాణా, నీరు, పట్టణాభివృద్ధి కూడా ఉన్నాయి. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, లీగల్, టెక్నాలజీ, బడ్జెట్, స్ట్రాటెజీ ప్లానింగ్ వంటి రంగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం మాస్టర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హత కలిగి ఉండాలి. ఈ అర్హతను 2027 సెప్టెంబర్‌లో ప్రోగ్రామ్ ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలి. అభ్యర్థులకు రెండు నుంచి ఆరు సంవత్సరాల సంబంధిత వర్క్ ఎక్స్‌పీరియన్స్ అవసరం. అండర్‌గ్రాడ్యుయేషన్ తర్వాత కనీసం రెండు సంవత్సరాల ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇంటర్న్‌షిప్‌లు, పార్ట్‌టైమ్ అనుభవం కూడా పరిగణించే అవకాశం ఉంది.
Also Read: 40 ఏళ్ల వయసు తరువాత కూడా కోట్లు సంపాదించవచ్చు.. ప్రముఖ వ్యాపారవేత్త చెప్పిన టిప్స్
అభ్యర్థులు.. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సభ్య దేశానికి చెందిన పౌరులై ఉండాలి. జాతీయతను పాస్‌పోర్ట్ లేదా అధికారిక పత్రంతో నిరూపించాలి. ఇంగ్లిష్‌లో మాట్లాడటం, రాయడంలో మంచి నైపుణ్యం తప్పనిసరి. అదనపు భాషల పరిజ్ఞానం వల్ల అడ్వాటేజ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌కు ప్రత్యేక వయోపరిమితి లేదు. అయితే అవసరమైన అనుభవం కారణంగా ఇది ప్రారంభ కెరీర్ నిపుణులకు అనుకూలంగా ఉంటుంది.
దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 1, 2026న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2026, రాత్రి 11:59 UTC టైమింగ్ లోపు.
లాంగ్‌లిస్టింగ్ అక్టోబర్‌లో జరుగుతుంది. అసెస్‌మెంట్లు అక్టోబర్ 15 నుంచి 31 వరకు ఉంటాయి. ఇంటర్వ్యూలు డిసెంబర్ 2026 నుంచి జనవరి 2027 మధ్య నిర్వహించనున్నారు. తుది ఎంపికను 2027 జనవరి చివరి నుంచి ఫిబ్రవరి ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రోగ్రామ్ సెప్టెంబర్ 2027లో ప్రారంభమవుతుంది.
Also Read: సగం ధరకే ఉల్లి విక్రయిస్తున్న ప్రభుత్వం.. మరి చక్కెరపై డిస్కౌంట్ ఎందుకు లేదు?
అభ్యర్థులు రెండు పేజీలకు మించని CV లేదా రెజ్యూమ్ సిద్ధం చేసుకోవాలి. పాస్‌పోర్ట్ ఫోటో పేజీ, అకడమిక్ పత్రాలను కూడా సిద్ధంగా ఉంచాలి. దరఖాస్తు సమయంలో అవసరం లేని అదనపు పత్రాలను అప్‌లోడ్ చేయకూడదు.
గమనిక: అర్హతలు, తేదీలు, ప్రయోజనాలు, ఉద్యోగ నిబంధనలను అధికారిక వరల్డ్ బ్యాంక్ ప్రకటనలో తప్పనిసరిగా ధృవీకరించండి.