BigTV English

Rainbow Tree : యూకలిప్టస్‌కు రెయిన్‌బో రంగులు

Rainbow Tree : యూకలిప్టస్‌కు రెయిన్‌బో రంగులు

Rainbow Tree : ఇది మాయాజాలం కాదు.. ఫొటోషాప్‌తో చేసిన మార్పులు అంతకన్నా కావు.. ప్రకృతి చేసే వింతలెన్నో. వాటిలో ఇదొకటి. సప్తవర్ణాల్లో చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి కదూ ఈ చెట్లు? ఉత్తరార్థగోళంలో మాత్రమే ఇలాంటి రెయిన్ బో యూకలిప్టస్ చెట్లు పెరుగుతాయి. ఫిలిప్పీన్స్, న్యూగినియా, ఇండొనేసియా ప్రాంతల్లో వీటిని చూడొచ్చు. అమెరికాలోని ఉష్ణప్రాంత ప్రాంతాలైన హవాయ్, టెక్సస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లోనూ ఈ ఇంద్రధనుస్సు చెట్లు దర్శనమిస్తాయి.


సముద్రమట్టానికి 1800 మీటర్ల‌లోపు ఎత్తున్న ఉష్ణమండల వర్షారణ్యాల్లో ఇవి పెరుగుతాయి. అయితే యూకలిప్టస్ డిగ్లూప్టా అనే జాతి వృక్షాల్లోనే కాండం ఇలా రంగురంగులతో కనిపిస్తుంది. సాధారణంగా ఇవి 76 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కాండం వ్యాసం 240 సెంటీమటర్ల వరకు ఉంటుంది. ముదురు పేస్టల్ కలర్స్‌తో ఉండే బెరడే ఈ చెట్లకు ప్రత్యేక ఆకర్షణ. బెరడు ఇలా సప్తవర్ణాల్లో మెరిసిపోవడానికి క్లోరోఫిల్ కారణం కావొచ్చనేది ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ లీ అభిప్రాయం.

బెరడు ఊడి రాలిపోయే(షెడ్డింగ్) దశలో గ్రీన్ క్లోరోఫిల్‌ వెలువడుతుంది. షెడ్డింగ్ అనేది చెట్లలో జరిగే ఓ రక్షణాత్మక ప్రక్రియ. హాని కలిగించే జీవులు, ఫంగస్ నుంచి చెట్లకు ఇది రక్షణ కల్పిస్తుంది. అయితే క్లోరోఫిల్ గాలికి బహిర్గతమైనప్పుడు టానిన్ అనే రసాయన పదార్థం ఏర్పడుతుంది. ఫంగస్ నుంచి చెట్లకు రక్షణ కల్పించేది ఇదే. వివిధ టానిన్లు రెడ్, ఎల్లో, బ్రౌన్, బ్లూ, పర్పుల్, పింక్ తదితర రంగుల్లో ఉంటాయి.


రెయిన్ బో యూకలిప్టస్ చెట్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వైట్ పేపర్ తయారీలో దీని పల్ప్‌వుడ్ అతి కీలకం. శ్వాసకోశవ్యాధులు, ఇతర గాయాలను నయం చేయగల ఔషధాల తయారీలో ఈ చెట్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాల మాటెలా ఉన్నా.. రంగుల్లో అందంగా కనిపించే రెయిన్ బో యూకలిప్టస్ అలంకార‌ప్రాయ వృక్షంగా ఎంతో పేరుంది. ఎంతో వేగంగా ఎదిగే ఈ చెట్టు ముందు ఇతర వృక్షజాతులు బతకడం కొంచెం కష్టమే. నరికివేత, పర్యావరణ మార్పులు ఈ రంగుల వృక్షానికి పెనుముప్పుగా మారాయి. రెయిన్ బో యూకలిప్టస్ చెట్లలో ఇప్పటికే మూడో భాగం కనుమరుగయ్యాయి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×