Supernatural Thriller OTT : కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత కొన్ని వింత సంఘటనలు ఎదురైతే మొదట్లో వాటిని యాదృచ్ఛికంగా భావిస్తాం. తలుపులు వాటంతట అవే కదలడం, ఎవరో ఉన్నట్టుగా అనిపించడం, కారణం తెలియని శబ్దాలు వినిపించడం లాంటివి పదేపదే జరిగితే మాత్రం భయం మొదలవుతుంది. ఒక డాక్టర్ దంపతులు కొత్త ఇంట్లోకి అడుగు పెడతారు. కొద్దిరోజులకే అక్కడ వింత సంఘటనలు మొదలవుతాయి. అసలు అక్కడ ఏం జరుగుతోందో వారికి అర్థం కాదు. చివరకు ఈ మిస్టరీని ఛేదించేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. కానీ అతను దర్యాప్తు మొదలుపెట్టాక ఒక్కో విషయం బయటపడుతూ కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇలాంటి అంశాలను నేపథ్యంగా తీసుకున్న హిందీ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘అద్భుత్’ (Adbhut). మరి ఈ హర్రర్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ? సినిమా విశేషాలేంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.
ఈ కథలో గజరాజ్ అవస్థి అనే డిటెక్టివ్ కీలక పాత్ర పోషిస్తాడు. పోలీసు శాఖ నుంచి గౌరవం అందుకున్న అతడిని, తన కెరీర్‌లో ఎదురైన అత్యంత క్లిష్టమైన కేసు గురించి అడుగుతారు. దానికి సమాధానంగా ఐదేళ్ల క్రితం జరిగిన ఓ మిస్టరీని గుర్తుచేసుకుంటాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. గుడ్ లైఫ్ ఆసుపత్రికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్ ఆదిత్య రావత్, అతని భార్య డాక్టర్ శ్రుతి రావత్ షిమ్లా సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి మారతారు. శ్రుతి తీవ్ర నిరాశతో బాధపడుతూ మందులు వాడుతుంటుంది. కొత్త ఇంట్లో ప్రశాంతంగా జీవితం ప్రారంభించాలనుకున్న ఈ దంపతులకు కొద్దిరోజులకే వింత అనుభవాలు ఎదురవుతాయి.
మొదట చిన్న విషయాలుగా కనిపించిన సంఘటనలు క్రమంగా భయంకరంగా మారతాయి. అసలు కారణం తెలియకపోవడంతో వారిలో ఆందోళన పెరుగుతుంది. పరిస్థితులు అదుపు తప్పడంతో ఆదిత్య, శ్రుతి ఈ కేసును ఛేదించేందుకు గజరాజ్ అవస్థి సహాయం కోరతారు. అతడు ఇంట్లో జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తూ, వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గుడ్ లైఫ్ ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మరో ప్రమాదకరమైన ఘటన చోటుచేసుకోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారుతుంది.
దర్యాప్తు సమయంలో గజరాజ్‌కు మేరీ మాథ్యూస్ అనే మహిళ గురించి తెలుస్తుంది. ఆ ఘటన జరిగిన సమయంలో ఆమె అక్కడ ఉండటం, ఆమె ప్రవర్తనలో కనిపించిన అనుమానాస్పద అంశాలు డిటెక్టివ్ దృష్టిని ఆకర్షిస్తాయి. ఆమెకు ఆదిత్య, శ్రుతి జీవితాలతో సంబంధం ఏమిటి ? కొత్త ఇంట్లో జరుగుతున్న వింత సంఘటనల వెనుక ఆమె పాత్ర ఉందా ? అసలు ఆ ఇంట్లో కనిపిస్తున్న శక్తి ఎవరిది? మేరీ మాథ్యూస్‌కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏమిటి ? ఆదిత్య, శ్రుతి దాచిపెడుతున్న నిజం బయటపడితే వారి జీవితాలు ఎలా మారతాయి? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
Also Read : కాపురంలో చిచ్చు పెట్టే ఏడేళ్ళ కిందటి ఫోటో… 8.2 రేటింగ్ తో టాప్ లేపుతున్న తమిళ సినిమా
‘అద్భుత్’ (Adbhut) 2024లో రూపొందిన హిందీ అతీంద్రియ హారర్ థ్రిల్లర్. ఈ చిత్రం 2024 సెప్టెంబర్ 15న సోనీ మ్యాక్స్‌లో టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైంది. అక్టోబర్ 9 నుంచి జియోహాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. దర్శకుడు సబ్బీర్ ఖాన్ రూపొందించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ డిటెక్టివ్ గజరాజ్ అవస్థిగా, డయానా పెంటీ మేరీ మాథ్యూస్‌గా, శ్రేయ ధన్వంతరి డాక్టర్ శ్రుతిగా, రోహన్ మెహ్రా డాక్టర్ ఆదిత్యగా కనిపిస్తారు. వింత సంఘటనలకు కారణం వెతికే దర్యాప్తు క్రమంగా ఓ పెద్ద రహస్యాన్ని బయటపెట్టే దిశగా సాగడం ఈ కథలో ప్రధాన ఆకర్షణ.