Action Thriller: కోట్ల విలువైన దోపిడీ విజయవంతమైంది. కానీ ఆ డబ్బుతో పారిపోయిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. తన వెంట పోలీసులు మాత్రమే కాదు… ఆ డబ్బు కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న క్రైమ్ బాస్ కూడా ఉంటాడు. ఎక్కడ దాక్కున్నా ప్రమాదం, ఎవరిని నమ్మినా మోసం జరిగే పరిస్థితి. తన గతాన్ని కూడా ఎదుర్కొంటూ ఓ మహిళ ప్రాణాల కోసం పరుగులు తీయాల్సి వస్తుంది. దోపిడీ కంటే దాని తర్వాత జరిగే వేటే ప్రాణాంతకంగా మారే యాక్షన్ థ్రిల్లర్ ‘లక్కీ’ (Lucky).మరి ఆ అమ్మాయికి లక్ కలిసి వచ్చిందా ? ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అనేది తెలియాలంటే ముందు కథలోకి వెళ్దాం.
లక్కీ ఓ కాన్ ఆర్టిస్ట్. మన భాషలో చెప్పాలంటే దొంగ పిల్ల. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి ప్లాన్ చేసిన మల్టీ మిలియన్ డాలర్ హీస్ట్ లో ఆమె పాల్గొంటుంది. కానీ ప్లాన్ అనుకున్నట్లుగా జరగదు. దోపిడీ తర్వాత పరిస్థితులు అదుపు తప్పడంతో లక్కీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు ఆమెకు ఎదురయ్యే ప్రధాన సమస్య FBI. దోపిడీకి సంబంధించిన ఆధారాలతో పోలీసులు ఆమెను వెతకడం మొదలుపెడతారు.
అదే సమయంలో ఓ క్రూరమైన క్రైమ్ బాస్ కూడా లక్కీ వెంట పడతాడు. అతనికి డబ్బు తిరిగి కావాలి. అందుకోసం లక్కీని ఎక్కడ ఉన్నా కనిపెట్టి పట్టుకోవడానికి తన మనుషులను పంపిస్తాడు. లక్కీకి మాత్రం ఒకేసారి రెండు ప్రమాదాలను తప్పించుకోవాల్సి వస్తుంది. ఓ వైపు చట్టం నుంచి పారిపోవాలి. మరోవైపు క్రైమ్ ప్రపంచంలో తనను వెతుకుతున్న వ్యక్తుల నుంచి తప్పించుకోవాలి. ఈ క్రమంలో ఆమెకు పరిచయం లేని ఓ కుటుంబం వద్ద ఆశ్రయం పొందాల్సి వస్తుంది.
చూస్తే వాళ్ళది సాధారణ కుటుంబంలా కనిపించినా, లక్కీ అక్కడ ఎక్కువసేపు దాక్కోలేనని అర్థం చేసుకుంటుంది. ఇదే సమయంలో లక్కీ తన తండ్రి, గతంలో తన జీవితంలో జరిగిన విషయాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె ప్రస్తుతం పెడుతున్న పరుగుకు కేవలం డబ్బే కారణం కాదు. తన గతంతో ఉన్న సంబంధాలు కూడా ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి.
పోలీసుల వేట, క్రైమ్ బాస్ ఒత్తిడి, ద్రోహం, డబ్బు కోసం జరిగే పోరాటం మధ్య లక్కీ తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని బయటపడటానికి ప్రయత్నిస్తుంది. అసలు ఆ కొట్టేసిన డబ్బు ఎక్కడ ఉంది ? దాన్ని ఎవరు తీసుకున్నారు ? లక్కీ ఎవరిని నమ్మాలి ? ఆమెను వెంటాడుతున్న వాళ్లలో నిజమైన ప్రమాదం ఏంటి ? ఆమె గతం ఏంటి ? అది ఈ దొంగతనానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉంది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమాను చూడాల్సిందే.
అన్యా టేలర్-జాయ్ (Anya Taylor-Joy), అనెట్ బెనింగ్ (Annette Bening), తిమోతీ ఒలిఫెంట్ (Timothy Olyphant), ఆంజన్యూ ఎల్లిస్-టేలర్ (Aunjanue Ellis-Taylor) నటించిన సిరీస్ ‘లక్కీ’. జోనాథన్ ట్రాపర్ (Jonathan Tropper) రూపొందించారు. ఇది ఏడు ఎపిసోడ్‌ల లిమిటెడ్ సిరీస్. Apple TVలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు, కానీ తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్