OTT Movie : ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉండే ఫామ్‌హౌస్‌లో, జెస్ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. కానీ ఒక భయంకరమైన సంఘటన ఆమె ఆశలను తలకిందులు చేస్తుంది. ఆమె కుమారుడు ఓవెన్ ని పెంపుడు కుక్క కరవడంతో, ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్‌తో బాధపడతాడు. అతని కళ్ళు మసకగా మారతాయి. అతని ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. అతనికి ఆకలి తీరాలంటే రక్తం తాగాల్సి వస్తుంది. ఒక నర్సుగా తన కొడుకును రక్షించడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది జెస్. కానీ అతని ఆకలి పెరుగుతున్న కొద్దీ పరిస్థితులు మారిపోతాయి. ఈ పరిస్థితులనుంచి వీళ్ళు ఎలా బయటపడతారు ? ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఈ మూవీ ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
జెస్ (మిచెల్ మోనఘన్) అనే నర్సు, తన భర్త పాట్రిక్ (స్కీట్ ఉల్రిచ్) నుండి విడాకుల తీసుకుంటుంది. తన ఇద్దరు పిల్లలు కుమార్తె టైలర్ (స్కైలర్ మోర్గాన్ జోన్స్) కుమారుడు ఓవెన్ (ఫిన్లే వోజ్టాక్-హిస్సాంగ్) తో తన ఫామ్‌హౌస్‌కు తిరిగి వస్తుంది. ఈ ఫామ్‌హౌస్ సమీపంలో ఒక ఎండిపోయిన సరస్సు ఉంటుంది. దాని మధ్యలో ఒక ఎండిపోయిన చెట్టు చుట్టూ నల్లటి బురద, జంతువుల శవాలు ఉంటాయి. వీళ్ళ పెంపుడు కుక్క పిప్పెన్ ఈ చెట్టును చూసి భయపడినట్లు కనిపిస్తుంది. ఆతరువాత ఒక రోజు పిప్పెన్ అడవుల్లోకి పారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత రక్తంతో తడిచిన భయంకర రూపంతో వచ్చి ఓవెన్‌పై దాడి చేసి కరుస్తుంది. జెస్ ఆ కుక్కను చంపేస్తుంది కానీ ఓవెన్‌కు ఒక వింతైన ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఓవెన్ ను ఆసుపత్రిలో జాయిన్ చేస్తుంది జెస్. ఓవెన్ ఆహారం తినడానికి నిరాకరించడంతో, అతని పరిస్థితి విషమిస్తుంది. అయితే ఆ రాత్రి జెస్ అతన్ని తన IV బ్యాగ్ నుండి రక్తం తాగుతూ చూస్తుంది. ఆశ్చర్యకరంగా అతని ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఓవెన్ రక్తం కావాలని జెస్ ను వేడుకుంటాడు. తన కొడుకును కాపాడాలనే తపనతో,ఆసుపత్రి నుండి ప్లాస్మా బ్యాగ్‌లను రహస్యంగా దొంగిలిస్తుంది జెస్.
ఈ క్రమంలో ఓవెన్ ప్రవర్తన వింతగా మారుతుంది. అతని చర్మం లేతగా మారుతుంది. అతని కళ్ళు చీకటిలో మెరుస్తాయి. అతనికి వెచ్చని మనిషి రక్తం కావాల్సి వస్తుంది. ఇక జెస్ జంతువుల రక్తంతో అతని ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ రక్తం పని చేయదు. తన సొంత రక్తాన్ని ఓవెన్‌కు ఇవ్వడం ద్వారా, జెస్ అనీమియాతో బాధపడుతుంది. ఆమె మాజీ భర్త పాట్రిక్ ఆమె మళ్లీ డ్రగ్స్ ఉపయోగిస్తోందని అనుమానిస్తాడు. ఈ సమయంలో జెస్ ఒక అనారోగ్యంతో ఉన్న హెలెన్ పరిచయం అవుతుంది. ఓవెన్ ఆకలిని తీర్చడానికి, హెలెన్ కు డ్రగ్ ఇచ్చి బేస్‌మెంట్‌లో బంధిస్తుంది జెస్. ఓవెన్ పరిస్థితి మరింత దిగజారుతుంది. అతను మానవ రక్తం కోసం మరింత హింసాత్మకంగా మారుతాడు. టైలర్ ఆ ఎండిపోయిన సరస్సు వద్ద ఉన్న చెట్టు ఈ ఇన్ఫెక్షన్‌కు కారణమని అనుమానిస్తుంది. చివరికి ఓవెన్ మనిషి రక్తం రుచి మరగడానికి కారణం ఏమిటి ? నదిలో ఉన్న చెట్టే దీనికి కారణమా ? జెస్ ఈ సమస్యను ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : క్రైమ్ ఉచ్చులో చిక్కుకునే సాధారణ మహిళ … దద్దరిల్లిపోయే సీన్స్ తో ఊహించని క్లైమాక్స్
ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బ్లడ్’ (Blood). 2023 వచ్చిన ఈ సినిమాకి బ్రాడ్ అండర్సన్ దర్శకత్వం వహించారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 48 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.5/10 రేటింగ్ ఉంది. ఇందులో మిచెల్ మోనఘన్ (జెస్), స్కీట్ ఉల్రిచ్ (పాట్రిక్), ఫిన్లే వోజ్టాక్-హిస్సాంగ్ (ఓవెన్), స్కైలర్ మోర్గాన్ జోన్స్ (టైలర్), జూన్ B. వైల్డ్ (హెలెన్), డానికా ఫ్రెడరిక్ వంటి నటులు నటించారు.