Best Air Purifier for Home: వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో ఉన్న గాలి నాణ్యతపై కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. బయట కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు తలుపులు, కిటికీలు మూసుకున్నా.. కొన్ని కాలుష్య కణాలు ఇంట్లోకి చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇంటి లేదా ఆఫీస్‌లో గాలిని శుభ్రంగా ఉంచేందుకు ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగపడతాయి. అయితే మార్కెట్‌లో రకరకాల మోడల్స్, ఫిల్టర్లు, ఫీచర్లతో ప్యూరిఫైయర్లు అందుబాటులో ఉండటంతో.. మన అవసరాలకు సరిపోయే మోడల్‌ను ఎంచుకోవడం కొంత కష్టమే. అందుకే ఎయిర్ ప్యూరిఫైయర్ కొనేముందు ఈ ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి.
ప్యూరిఫైయర్ కొనేముందు అది ఏ గది కోసం తీసుకుంటున్నారో గమనించాలి. చిన్న బెడ్‌రూమ్‌లకు కనీసం 250 సీఏడీఆర్ (CADR) సామర్థ్యం ఉన్నది సరిపోతుంది. అదే పెద్ద హాల్స్ లేదా ఆఫీస్ స్పేస్‌లకైతే 400 కంటే ఎక్కువ సీఏడీఆర్ ఉండేలా చూసుకోవడం మంచిది.
కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ట్రూ హెపా (True HEPA) ఫిల్టర్ ఉన్న మోడల్స్ మాత్రమే ఎంచుకోవాలి. ఇది గాలిలోని అతి చిన్న కాలుష్య కణాలను కూడా పీల్చేస్తుంది. దీంతో పాటు దుర్వాసన, హానికర వాయువులను తొలగించడానికి కార్బన్ ఫిల్టర్ కూడా ఉందో లేదో సరిచూసుకోవాలి.
Also Read: మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ నిజమేనా? కేంద్రం క్లారిటీ, సుప్రీంకోర్టు కీలక సూచనలు!
ఏసీహెచ్ (ACH) రేటింగ్ అనేది ఒక గంటలో ప్యూరిఫైయర్ గదిలోని గాలిని ఎన్నిసార్లు శుభ్రం చేస్తుందో చెబుతుంది. సాధారణ ఇళ్లకు 4 నుండి 5 ఏసీహెచ్ సరిపోతుంది. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్లు లేదా ఆస్తమా సమస్య ఉన్నవారు ఉంటే మాత్రం 6 నుండి 8 ఏసీహెచ్ ఉన్నది తీసుకోవాలి.
కంపెనీలు ఫిల్టర్ ఏళ్ల తరబడి వస్తుందని చెప్పినా.. మన దగ్గర ఉన్న తీవ్రమైన కాలుష్యానికి 3 నుండి 6 నెలల్లోనే అవి పాడైపోతాయి. కాబట్టి.. కొత్త ఫిల్టర్ ధర ఎంత ఉందో, అది సులభంగా దొరుకుతుందో లేదో కొనేముందే తెలుసుకోవాలి.
ఫోన్ యాప్ కంట్రోల్, డిస్‌ప్లే, వైఫై వంటి స్మార్ట్ ఫీచర్లు వాడటానికి బాగుంటాయి. కానీ వీటికంటే గాలిని ఎంత బాగా శుభ్రం చేస్తోందనేదే ముఖ్యం. క్లీనింగ్ పవర్ బాగుండి, ఇవి కూడా ఉంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
మనం ప్యూరిఫైయర్‌ను రోజంతా, రాత్రిపూట కూడా వాడుతుంటాం. కాబట్టి అది పనిచేసేటప్పుడు ఎక్కువ శబ్దం రాకూడదు. ముఖ్యంగా నిద్రపోయే సమయంలో ఇబ్బంది లేకుండా స్లీప్ మోడ్ లేదా 30 డెసిబెల్స్ కంటే తక్కువ శబ్దం చేసేది ఎంచుకోవడం మంచిది.
ఎక్కువ ధర ఉన్న ప్రతి ప్యూరిఫైయర్ గొప్పగా పనిచేస్తుందని అనుకోలేం. మధ్యస్థ ధరలో వచ్చే మంచి బ్రాండ్లు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మీ గది సైజ్, ఫిల్టర్ నాణ్యతను బట్టి బడ్జెట్‌కు తగిన ప్యూరిఫైయర్ ఎంచుకుంటే సరిపోతుంది.
Also Read: ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ ఛానల్స్.. ఇదెలా సాధ్యం అంటే?