Chinese Drama: చదువు పూర్తి చేసుకుని మంచి కెరీర్ కోసం ఆఫీస్ లో అడుగు పెట్టిన ఓ యువతి… తన ప్రతిభతో పైకి రావాలనుకుంటుంది. కానీ కార్పొరేట్ ప్రపంచంలో టాలెంట్ ఒక్కటే సరిపోదని ఆమెకు త్వరగానే అర్థమవుతుంది. ఆఫీస్ లో పోటీ, ఐడియాల దొంగతనం, ఆఫీస్ పాలిటిక్స్ అన్నీ ఉంటాయి. అదే సమయంలో తనకు మార్గదర్శకుడిగా కనిపించే ఓ సీనియర్ వ్యక్తి, అతను చేసే పనుల వెనుక ఓ సీక్రెట్ ప్లాన్ ఉంటుంది. కెరీర్, నమ్మకం, ప్రతీకారం, ప్రేమ… అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడే కథే ‘ఇర్రిప్లేసబుల్’ (Irreplaceable). జాబ్ చేసే ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఈ వర్క్ ప్లేస్ డ్రామా ఏ ఓటీటీలో ఉందంటే ?
జూ చీ మధ్య తరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యువతి. తన జీవితాన్ని మార్చుకోవాలనే పట్టుదలతో చదువు పూర్తి చేసి ప్రొఫెషనల్ కన్సల్టెంట్ గా కెరీర్ మొదలు పెడుతుంది. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం క్రమంగా పెద్ద కార్పొరేట్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అక్కడ ప్రతిభ ఉన్న వాళ్లతో పాటు తమ ప్రయోజనాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు కూడా ఉంటారు.
జూ చీ కెరీర్ లోకి యే షింజీ ప్రవేశిస్తాడు. అతను అనుభవం ఉన్న ప్రొఫెషనల్. చూడడానికి జూ చీకి గైడ్ చేసే వ్యక్తిలా కనిపిస్తాడు. కానీ అతని మనసులో మాత్రం సంస్థలోని కొన్ని వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవాలనే రహస్య ప్రణాళిక ఉంటుంది. ఈ ప్లాన్ లో జూ చీని కూడా భాగం చేయడానికి ప్రయత్నిస్తాడు. కార్పొరేట్ ప్రపంచంలో ముందుకు వెళ్లే క్రమంలో జూ చీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె చేసిన పనికి మరొకరు క్రెడిట్ తీసుకోవడం, విద్యార్హతలు లేదా నేపథ్యం ఆధారంగా తేడా చూపించడం, ఆఫీస్ లో చిన్నచిన్న గ్రూపులుగా విడిపోయి నిర్ణయాలు తీసుకోవడం వంటి పరిస్థితులు ఆమెను టెన్షన్ పెడతాయి.
తన చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరు నిజంగా తనకు సహాయం చేయాలనుకుంటున్నారు ? ఎవరు తమ ప్రయోజనం కోసం దగ్గరవుతున్నారు ? అనే విషయం ఆమెకు అర్థం కాకుండా పోతుంది. ఇదే సమయంలో జూ చీ, యే షింజీ మధ్య వ్యక్తిగత అనుబంధం కూడా పెరుగుతుంది. ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ క్రమంగా భావోద్వేగ బంధంగా మారుతున్నా, ఇద్దరి జీవితాల్లో ఉన్న రహస్యాలు ఆ బంధానికి అడ్డుగా మారతాయి. యే షింజీ ప్రతీకార ప్రణాళిక ముందుకు వెళ్లేకొద్దీ జూ చీ తన కెరీర్ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు మరింత కఠినమవుతాయి. ఒకవైపు తన ప్రతిభతో నిలబడాలనే జూ చీ పోరాటం, మరోవైపు కార్పొరేట్ వ్యవస్థలో దాగి ఉన్న రాజకీయాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య ఈ డ్రామా సాగుతుంది.
జావో జిన్‌మై (Zhao Jinmai), వెయ్ దాక్సున్ (Wei Daxun), వాంగ్ యుయాంకే (Wang Yuanke) ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇర్రిప్లేసబుల్’ చైనీస్ డ్రామా. సెప్టెంబర్ 28న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్ Youkuతో పాటు గ్లోబల్ గా Netflixలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఓటీటీలో తెలుగు ఆడియో లేదు.