Chinese Fantasy Movie: ఒక శక్తివంతమైన రాజు తన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా స్వార్థం కోసం ఉపయోగిస్తే మొత్తం రాజ్యం ప్రమాదంలో పడుతుంది. దేవతల కోపానికి గురైన రాజ్యాన్ని తిరిగి కాపాడేందుకు మానవ యోధులు, దైవిక శక్తులు కలిసి ఒక దివ్యమైన వస్తువును చేజిక్కించుకోవాలని రాక్షస సైన్యం ప్రయత్నిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో చైనీస్ పురాణాలు, దేవతలు, రాక్షసులు, భారీ యుద్ధాలు, మంత్రశక్తులతో తెరకెక్కిన విజువల్ ఫాంటసీ చిత్రం ‘క్రియేషన్ ఆఫ్ ది గాడ్స్: కింగ్‌డమ్ ఆఫ్ స్ట్రోమ్స్ ’ (Creation of the Gods: Kingdom of Storms).
ష్యాంగ్ రాజవంశానికి చెందిన రాజు జౌ కథతో ఈ చిత్రం మొదలవుతుంది. అధికారంలో ఉన్న రాజు ప్రజల సంక్షేమం కంటే తన స్వార్థానికే ప్రాధాన్యత ఇస్తాడు. అదే సమయంలో అతడు ఒక భయంకరమైన నక్క రాక్షసి ప్రభావంలోకి వెళ్తాడు. ఆమె మాటలను నమ్ముతూ తీసుకునే నిర్ణయాలు క్రమంగా రాజ్యానికి ప్రమాదంగా మారతాయి.
రాజు పాలన దుర్మార్గంగా మారుతున్న కొద్దీ ప్రజల కష్టాలు పెరుగుతాయి. రాజ్యంపై దేవతల ఆగ్రహం కూడా మొదలవుతుంది. శాపాలు, కరవు, రాక్షస శక్తుల ప్రభావం పెరగడంతో సాధారణ ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఒకప్పుడు బలంగా ఉన్న రాజ్యం లోపల నుంచే బలహీనపడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలాంటి సమయంలో స్వర్గలోకం నుంచి దేవతలు రంగంలోకి దిగుతారు. రాజ్యానికి పట్టిన శాపాన్ని తొలగించడానికి ఒక ప్రత్యేకమైన దివ్య పటం అవసరమని నిర్ణయిస్తారు. అదే ‘ఫెంగ్షెన్ చార్ట్’. ఈ పటం సాధారణ వస్తువు కాదు. సరైన మానవ యోధుడి చేతుల్లోకి వెళ్తే రాజ్యాన్ని కాపాడే మార్గం తెరుచుకుంటుంది. ఈ బాధ్యతను యోధుడు జియా జియాంగ్ తీసుకుంటాడు. అయితే ఈ పటం గురించి రాజుకు, అతని రాక్షస సైన్యానికి కూడా తెలుస్తుంది. ఆ పటం తమ చేతికి వస్తే అమరత్వం పొందవచ్చని వారు భావిస్తారు. దీంతో దివ్య పటాన్ని కాపాడే ప్రయత్నం ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుంది.
ఇక అక్కడి నుంచి కథలో దేవతల శక్తులు పొందిన యోధులు ఒకవైపు, రాక్షస శక్తులతో ఉన్న సైన్యం మరోవైపు నిలబడతాయి. మానవ లోకం, దైవిక శక్తులు, రాక్షస బలగాల మధ్య పోరాటం మరింత తీవ్రమవుతుంది. మంత్రజాలం, అద్భుతమైన శక్తులు, భారీ యుద్ధాలు కథకు విజువల్ గ్రాండియర్‌ను తీసుకొస్తాయి.
అయితే కథలో ప్రధానమైన ప్రశ్న ఒక్కటే. ఫెంగ్షెన్ చార్ట్ చివరికి ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? దాన్ని రాక్షస శక్తుల నుంచి కాపాడగలిగితేనే రాజ్యానికి శాంతి వస్తుంది. దేవతలు ఎంచుకున్న మార్గం విజయవంతమవుతుందా? రాజు సృష్టించిన వినాశనం నుంచి రాజ్యం బయటపడుతుందా? అన్నదే చివరి వరకు ఆసక్తిని కొనసాగిస్తుంది.
‘క్రియేషన్ ఆఫ్ ది గాడ్స్: కింగ్‌డమ్ ఆఫ్ స్ట్రోమ్స్’ (Creation of the Gods: Kingdom of Storms) 2023 సెప్టెంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం హాట్‌స్టార్ (Hotstar)*లో తెలుగు డబ్బింగ్ ఆడియోతో అందుబాటులో ఉంది. చైనీస్ పురాణాలు, దేవతలు, రాక్షసులు, భారీ యుద్ధాలు, ఫాంటసీ విజువల్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.
Read Also: అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్