Snake 5 Monster City OTT: జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీకి బయట ప్రపంచం స్వేచ్ఛగా స్వాగతం పలుకుతుందని అనుకుంటే… అక్కడే వేలకొద్దీ రాక్షస సర్పాలు ఎదురైతే? ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వచ్చిన అతనే, మాన్‌స్టర్స్‌తో నిండిపోయిన ఓ నగరంలో చిక్కుకుపోతే? పైగా అదే నగరంలో తన తల్లి కూడా ప్రమాదంలో ఉందని తెలిస్తే? ఒకవైపు పోలీసులు వెంటపడుతుంటే, మరోవైపు ప్రాణాంతకమైన సర్పాలు దాడి చేస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వచ్చిన చైనీస్ క్రీచర్ హారర్ యాక్షన్ మూవీ ‘స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ’ (Snake 5 Monster City). మరి ఆ నగరం మాన్‌స్టర్ సిటీగా ఎలా మారింది? ఖైదీ తన తల్లిని ఎలా కాపాడాడు? సినిమాను తెలుగులో ఎక్కడ చూడొచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కథ సముద్రం దగ్గర జరిగే కొన్ని అనుమానాస్పద సంఘటనలతో మొదలవుతుంది. శవాలు, ధ్వంసమైన ఓడ కనిపించడంతో ఏదో ప్రమాదకరమైన విషయం జరిగిందని తెలుస్తుంది. అదే సమయంలో జైలులోకి భారీ సర్పాలు చొరబడి కలకలం సృష్టిస్తాయి. ఆ గందరగోళాన్ని ఉపయోగించుకుని మరణశిక్ష ఖైదీ వు చువాన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. బయటకు వచ్చిన తర్వాత స్వేచ్ఛ దొరికిందని అనుకునేలోపే అతనికి అసలు భయం ఎదురవుతుంది. అతను చేరుకున్న ప్రాంతం భారీ సర్పాలు, విచిత్రమైన భయంకరమైన జీవులతో నిండిపోయి ఉంటుంది. ఒకప్పుడు మనుషులు నివసించిన ఆ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా మాన్‌స్టర్ సిటీగా మారిపోయిందని వు చువాన్‌కు అర్థమవుతుంది.
అయినా అతను అక్కడి నుంచి పారిపోవాలని అనుకోడు. ఈ విపత్తులో తన తల్లి కూడా చిక్కుకుపోయిందని తెలుసుకున్న తర్వాత ఆమెను కాపాడేందుకు మళ్లీ ఆ ప్రమాదకరమైన నగరంలోకి అడుగు పెడతాడు. మరోవైపు పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. దీంతో వు చువాన్‌కు రెండు వైపులా ప్రమాదమే. ఒకవైపు పట్టుబడితే మళ్లీ జైలు… మరోవైపు మాన్‌స్టర్స్ చేతికి చిక్కితే ప్రాణాలకే ప్రమాదం. అయినా తల్లిని రక్షించాలనే పట్టుదలతో అతను ముందుకు సాగుతాడు. నగరంలోని ప్రతి ప్రాంతం కొత్త ముప్పుగా మారుతుంది. ఎక్కడి నుంచి సర్పం దాడి చేస్తుందో తెలియదు. చీకటిలో దాగి ఉన్న జీవులు ఎప్పుడు బయటకు వస్తాయో అర్థం కాదు.
ఈ క్రమంలో తన తెలివితేటలు, ధైర్యంతో ఒక్కో ప్రమాదాన్ని దాటుకుంటూ వు చువాన్ తల్లి దగ్గరకు చేరుకునే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ఈ మాన్‌స్టర్ విపత్తు వెనుక అసలు కారణం ఏంటి అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ జీవులు సహజంగానే వచ్చాయా? లేక వాటి వెనుక మరేదైనా రహస్యం ఉందా? చివరకు వు చువాన్ తన తల్లిని కాపాడగలిగాడా? మాన్‌స్టర్ సిటీ నుంచి ప్రాణాలతో బయటపడ్డాడా? తన వెంటపడుతున్న పోలీసుల నుంచి తప్పించుకున్నాడా? ఈ భయంకరమైన సర్పాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనేదే సినిమాలో చూడాల్సిన అసలైన కథ.
‘స్నేక్ 5 మాన్‌స్టర్ సిటీ’ ఆగస్టు 21 నుంచి భారతదేశంలో Lionsgate Play ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మాండరిన్ ఆడియోలో అందుబాటులో ఉంది. లిన్ జెన్‌జావో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాంగ్ అయోయు, లియాంగ్ సాంగ్‌కింగ్, బావో బేయర్ తదితరులు నటించారు. భారీ సర్పాలు, క్రీచర్ ఎటాక్స్, సర్వైవల్ యాక్షన్, మాన్‌స్టర్ సిటీ కాన్సెప్ట్ నచ్చేవారికి ఈ సినిమా మంచి టైమ్‌పాస్. ముఖ్యంగా జెయింట్ స్నేక్, క్రీచర్ హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు.
Read Also: శవాలను మాయం చేసే బిజినెస్… ఈ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు