KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చెన్నైలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. గత 26 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదన్నారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసిందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదన్నారు. భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం అని, అలాంటప్పుడు బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం? అని కేటీఆర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ శాపంగా మారుతుందన్నారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24% నుంచి 19%కి తగ్గిందన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏంటని నిలదీశారు.
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలకు మహిళా రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మేము మద్దతు ఇస్తామన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలను తాము నమ్మలేం అన్నారు. తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా కేంద్రం ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. కేవలం తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగానే బీజేపీ డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్తోందని మేము భావిస్తున్నామన్నారు.
Also Read: విమానాన్ని హైజాక్ చేయలేదట.. పైలెట్ల లొల్లి వల్లే దారి తప్పిందట.. ఎంత టెన్షన్ పెట్టారో!
అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు పెంచలేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయన్నారు. 2023 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 420కి పైగా హామీలు ఇచ్చినా, వాటిలో ఒక్కటినీ పూర్తిగా అమలు చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఉందన్నారు. ప్రజల్లో రీ గ్రేట్ నుంచి రివోల్టు (తిరుగుబాటు) దిశగా మార్పు కనిపిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారన్నారని పేర్కొన్నారు.
Also Read: USB 2.0 vs USB 3.0.. రెండింటి మధ్య తేడాలేంటి? మీ అవసరాలకు ఏది బెటర్?